అవెంజర్స్‌ అంతులేని యుద్ధం!

ఓ యుద్ధం మొదలైతే అంతే. ఓ పట్టాన ఆగదు. అందులోనూ అంతరిక్ష పోరాటం అయితే మరీనూ. సినిమాల తరబడి సాగుతూనే ఉంటుంది. అందుకే ‘అవెంజర్స్‌’ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అందునా అందరూ సూపర్‌హీరోలేనాయె. పైగా భూమికే కాదు, నక్షత్ర మండలానికే ప్రమాదం వచ్చిపడింది. ఎక్కడో సుదూరంలో ఉండే గెలాక్సీకి చెందిన గ్రహాంతర వాసులు ఆధునిక ఆయుధాలతో వచ్చి భూమిని మాకిచ్చేయమంటే ఎలా ఊరుకోవడం? కాబట్టే అంతవరకు ఎవరికి వారు వేర్వేరు సినిమాల్లో జనాన్ని రక్షించిన సూపర్‌హీరోలందరూ కలిసి కట్టుగా బయల్దేరి మరీ యుద్ధం ప్రారంభించారు. ఎప్పుడనుకుంటున్నారు... 2012లో. అదే ‘ద అవెంజర్స్‌’ తొలి సినిమా. ఆపై 2015లో ‘అవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ పేరుతో విజృంభించారు. అయినా యుద్ధం పూర్తవలేదు. ఇక లాభం లేదని ఈసారి ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ అంటూ 2018లో అంతులేని యుద్ధానికి తలపడ్డారు. పైగా ఈసారి మామూలుగా కాదని, త్రీడీలో ఐమాక్స్‌ వెర్షన్‌లో తయారయ్యారు. వాళ్ల యుద్ధం మంచి ఫలితమే ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 2 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఆస్కార్‌ అవార్డు కూడా వచ్చింది. పోనీ, ఇప్పటికైనా యుద్ధం ఆగిందా? అబ్బే... లేదు. దీనికి సీక్వెల్‌గా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ అని మరో పోరాటం 2019 ఏప్రిల్‌ 26 రాబోతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.