వేరొకరి మెదడులోకి దూరితే?

కొన్ని కథలకు రీజనింగులు ఉండవు, ఇమేజనింగులు తప్ప. లాజిక్‌లు ఉండవు, మేజిక్‌లు తప్ప. ‘అదేంటని?’ అడగకూడదు, ‘అలాగా?’ అని చూసేయడమే. అలాంటి కథతో తీసిన సినిమానే ‘బీయింగ్‌ జాన్‌ మాల్కోవిచ్‌’ (1999). మాల్కోవిచ్‌ ఓ హాలీవుడ్‌ నటుడు. అతడి మెదడులోకి దూరి అతడి ప్రవర్తనను నియంత్రించగలిగే కిటుకు కనిపెట్టిన ఓ వ్యక్తి కథ ఇది. ఇంకొకళ్ల మెదడులోకి దూరడమేంటి? వాళ్ల ఆలోచనలను నియంత్రించమేంటి? ఇదెలా సాధ్యం?... ఇవేమీ అడక్కూడదు. సినిమా తీశారు కాబట్టి చూసేయడమే. చిత్రమేమంటే, ఇందులో హాలీవుడ్‌ నటుడు జాన్‌ మాల్కోవిచ్‌తో పాటు, నటులు జాన్‌ కుసాక్, కామెరాన్‌ డియాజ్, క్యాథరీన్‌ కీనర్, చార్లీ షీన్‌లు వాళ్ల పాత్రల్లో వాళ్లే నటించడం! అంటే నిజం నటుల చుట్టూ కథ అల్లి, వాళ్ల పాత్రల్లో వాళ్లనే నటింపజేసిన చిత్రమన్నమాట. మరో విశేషం... ఈ సినిమా విజయవంతం కావడం. పైగా ఈ కథను అల్లిన చార్లీ కౌఫ్‌మన్, దర్శకత్వం వహించిన స్పైక్‌ జోన్జ్‌కు ఇదే తొలి చిత్రం కావడం మరో విచిత్రం. అంతేకాకుండా ఈ సినిమా మూడు ఆస్కార్‌ అవార్డులకు నామినేషన్లు పొందడమే కాకుండా, 13 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కు 32.4 మిలియన్‌ డాలర్లు కూడా వసూలు చేసింది. తోలుబొమ్మలు ఆడించే వ్యక్తి అనుకోకుండా జాన్‌ మాల్కోవిచ్‌ మెదడులోకి దూరడమెలాగో కనిపెడతాడు. తాను వెళ్లడమే కాకుండా ఇతరులను కూడా అతడి మెదడులోకి పంపించి డబ్బులు వసూలు చేస్తాడు. ఓ నటుడి మెదడులోకి వేరే నటులు వెళితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయనే ఊహతో వినోదభరితంగా తీశారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.