కాసులు కురిపించిన నవలా చిత్రం
-సినీ చరిత్రలోనే గొప్ప కార్‌ ఛేజింగ్‌ సన్నివేశం ఆ సినిమాలోనే ఉంది...

-నాలుగు మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 42.3 మిలియన్‌ డాలర్లు కురిపించింది...

-ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు, ప్రశంసలు అందుకుంది...

-అమెరికా ఫిలిం రిజిస్ట్రీలో భావి తరాల కోసం భద్రపరిచారీ చిత్రాన్ని...


అదే... ‘బుల్లిట్‌’ (1968) సినిమా. అమెరికా రచయిత రాబర్ట్‌ ఎల్‌. ఫిష్‌ 1963లో రాసిన ‘మ్యూట్‌ విట్‌నెస్‌’ అనే నవల ఆధారంగా తీసిన ఈ చిత్రానికి ఇంగ్లిష్‌ దర్శకుడు పీటర్‌ ఏట్స్‌ దర్శకత్వం వహించాడు. ‘కింగ్‌ ఆఫ్‌ కూల్‌’గా ప్రాచుర్యం పొందిన ప్రముఖ నటుడు, ఆస్కార్‌ విజేత స్టీవ్‌ మెక్వీన్, రాబర్ట్‌ వాగ్, ఇంగ్లిష్‌ నటి జాక్వెలిన్‌ బిస్సెట్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ఆస్కార్‌ అందుకుంది. ఓ కీలకమైన సాక్షిని కోర్టుకు తీసుకువెళుతుండగా చంపేసిన మాఫియా ముఠాను ఓ బుల్లిట్‌ అనే పోలీస్‌ అధికారి ఎలా వెంటాడి మట్టుబెట్టాడనేది కథ. సినిమాల్లో అత్యంత ఉత్కంఠ భరితంగా చిత్రీకరించిన కార్‌ ఛేజింగ్‌ దృశ్యాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ దృశ్యాలు హాలీవుడ్‌ సినిమాల స్థాయినే పెంచాయనే ప్రశంసలు లభించాయి. ఖరీదైన నాలుగు కార్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా వ్యయప్రయాసలకు ఓర్చి చిత్రీకరించారు. వీటిని చిత్రీకరించే కారును కూడా అంతే వేగంతో నడుపుతూ షూటింగ్‌ చేశారు. ఇందుకోసం కార్ల ఇంజిన్ల సామర్థ్యాన్ని పెంచి, అత్యంత నిపుణులైన డ్రైవర్లతో నడిపించారు. ఈ ఛేజింగ్‌ దృశ్యాలను తీయడానికి అయిదు వారాలు పట్టింది. మొత్తం సన్నివేశం నిడివి పది నిమిషాల 53 సెకన్లు వచ్చింది. ఈ సన్నివేశాలను అత్యంత నైపుణ్యంతో వాస్తవికంగా ఎడిట్‌ చేసిన కృష్టికి ఆస్కార్‌ అవార్డు లభించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.