అలరిస్తున్న ‘కేన్స్’ భామలు

కేన్స్‌ చిత్రోత్సవాలు ఎంతో అట్టహాసంగా మొదలై సందడిగా సాగుతున్నాయి. 72వ కేన్స్‌ చిత్రోత్సవాల్లో తొలి రోజు ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు అందాల తారలు రెడ్‌ కార్పెట్‌పై నడిచి కనువిందు చేశారు. ఈసారి మన దేశం నుంచి పలువురు అందాల తారలు రెడ్‌ కార్పెట్‌పై నడవడానికి సిద్ధమవుతున్నా ఒక్క చిత్రం కూడా ప్రదర్శనకు ఎంపిక కాలేదు.

తీరే వేరు...
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చిత్రోత్సవాలు జరుగుతుంటాయి. కానీ కేన్స్‌ చిత్రోత్సవాలకున్న ఆ క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో తెరకెక్కిన చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఎంత గొప్ప నటీమణులైనా కేన్స్‌ ఎర్రతివాచీపై హొయలు పోవాలని ఆశపడతారు. కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రాలకు ‘పామ్‌ డీ ఓర్‌’ పురస్కారాన్ని అందిస్తారు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గొప్పగా భావిస్తారు సినిమా రూపకర్తలు.

* తొలి కేన్స్‌ చిత్రోత్సవం 1946లో జరిగింది. నిజానికి 1939లోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావాలి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఏడేళ్ల తర్వాత కేన్స్‌ ఉత్సవాలు మొదలయ్యాయి.

* కేన్స్‌ చిత్రోత్సవాల్లో అత్యున్నత పురస్కారం ‘పామ్‌ డీ ఓర్‌’. 24 క్యారెట్ల బంగారం, క్రిస్టల్స్‌తో దీన్ని తయారు చేస్తారు. ప్రతి ఏడాది రెండు పురస్కారాలను సిద్ధం చేస్తారు. విజేతగా నిలిచేది ఒక్కరే అయినా అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఆ పురస్కారాన్ని గెలుచుకుంటే ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేశారు.

* కేన్స్‌ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది రెడ్‌ కార్పెట్‌పై నడిచే తారల అందాలే. ప్రత్యేకంగా తయారు చేసే ఈ రెడ్‌ కార్పెట్‌ను రెండు కిలోమీటర్ల మేర పరుస్తారు. కార్పెట్‌పై నడిచే అతిథుల సంఖ్యను బట్టి రోజుకు కనీసం మూడుసార్లు కార్పెట్‌ను మారుస్తారు. ఈ లెక్కన చిత్రోత్సవాలు పూర్తయ్యేనాటికి కనీసం 35 నుంచి 40 సార్లు కార్పెట్‌ను మారుస్తారు.* చిత్రోత్సవ నిర్వహణ కోసం సుమారు 20 మిలియన్‌ యూరోలను ఖర్చుచేస్తారు.

* కేన్స్‌ ఫెస్టివల్‌ మొదలైన నాటి నుంచి 1959 వరకు ఫ్రెంచ్‌ వ్యక్తే జ్యూరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉండేవారు. 1960లో బెల్జియంకు చెందిన జార్జ్‌ సైమన్‌ అధ్యక్షుడై దీనికి స్వస్తి పలికారు.

* కేన్స్‌ పట్టణ జనాభా 73,000. కానీ చిత్రోత్సవాల సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులు, ఫ్యాషన్‌ ప్రియులతో ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని అంచనా.

* కేన్స్‌ పట్టణంలోని హోటెల్స్‌ సంవత్సరంలో ఆర్జించే మొత్తంలోని 15 శాతం కేవలం చిత్రోత్సవాలు జరిగే 12 రోజుల్లోనే వస్తుందట.


రెహమాన్‌ సందడి
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫ్రెంచ్‌ రివేరా నదీ తీర అందాల్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన వర్చువల్‌ రియాలిటీ చిత్రం ‘లే మస్క్‌’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన భార్యతో కలిసి కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు రెహమాన్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.