దివాళా నుంచి... గట్టెక్కించి!

వాల్ట్‌డిస్నీ అంటేనే కళ్ల ముందు అద్భుతమైన సినిమాలు కదులాడుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న యానిమేషన్‌ చిత్రాలు కనిపిస్తాయి. కానీ వాటిని రూపొందించే క్రమంలో కొన్ని సినిమాల వల్ల విపరీతమైన నష్టాలను కూడా ఎదుర్కొంది వాల్ట్‌డిస్నీ సంస్థ. ప్రపంచ యుద్ధంలాంటి కొన్ని పరిణామాల వల్ల ‘పినాకియో’, ‘ఫెంటాసియా’, ‘బాంబీ’ లాంటి సినిమాలు నష్టపోవడంతో ఒక దశలో డిస్నీ సంస్థ దివాళాతీసే స్థితికి వచ్చింది. చిత్రమేమంటే అప్పట్లో విఫలమైన ఆ సినిమాలన్నీ ఆ తరువాత ఎన్నిసార్లు విడుదల చేసినా కాసుల పంట పండించడం విశేషం. దివాళా దశలో ఉన్నప్పుడు యానిమేషన్‌ ఖర్చులు పెరిగిపోవడంతో ఫీచర్‌ ఫిల్మ్‌ల వేపు దృష్టి సారించాడు డిస్నీ. ఆ తరువాత ఫెయిరీ టేల్స్‌ పట్ల ఉన్న ఇష్టమే మరో సాహసం చేయించింది. ఆ సాహసం పేరే ‘సిండ్రెల్లా’ (1950). ఇది డిస్నీ వారి యానిమేషన్‌ సినిమాల్లో 20వది. సంగీత భరితంగా సాగే ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, డిస్నీ సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేసింది. ఆ సంస్థ 1937లో తీసిన ‘స్నోవైట్‌ అండ్‌ సెవెన్‌ డ్వార్ఫ్స్‌’ తరువాత అంతటి విజయం సాధించిన సినిమా ఇదే. దీని విజయంతో దీనికి రెండు సీక్వెల్స్‌ కూడా వచ్చాయి. అలాగే 2015లో లైవ్‌ యాక్షన్‌ సినిమా కూడా వచ్చింది. ఫెయిరీ టేల్స్‌ అంటే ఇష్టపడేవారికి ‘సిండ్రెల్లా’ గురించి చెప్పక్కర్లేదు. ఫెయిరీ టేల్స్‌ కథ: ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్నీ పెద్దల్నీ తరతరాలుగా ఆకట్టుకునే ఫెయిరీ టేల్స్‌కి ఆద్యుడెవరో తెలుసా? చార్లెస్‌ పెరౌల్ట్‌ అనే ఫ్రెంచ్‌ రచయిత. ప్రపంచ సాహిత్యంతో ఫెయిరీ టేల్స్‌ అనే ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఈయనే. పదిహేడో శతాబ్దానికి చెందిన ఈయన, తల్లిదండ్రుల సంతానంలో ఏడవ వాడు. చురుగ్గా చదువుకుని న్యాయవిద్యను అభ్యసించాడు. ఆపై ప్యారిస్‌లో ట్యాక్స్‌ కలెక్టర్‌గా పనిచేశాడు. కింగ్‌ లూయిస్‌-14 హయాంలో ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నత హోదా అనుభవించాడు. రచన ఆయన అభిరుచి. పదవీ విరమణ తర్వాత తన 67వ ఏట పిల్లల కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 1697లో ‘టేల్స్‌ అండ్‌ స్టోరీస్‌ ఆఫ్‌ ద పాస్ట్‌ విత్‌ మోరల్స్‌’ పేరిట కథలు రాయసాగాడు. అలా ఆయన వెలుగులోకి తీసుకువచ్చిన పురాతన జానపద కథలన్నీ అద్భుత కల్పనలతోను, మాయలతోను, విచిత్ర పాత్రలతోను నిండి యానిమేషన్‌ సినిమాలుగా వెండితెరకెక్కాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.