బాస్‌ని ప్రేమించిన సేల్స్‌గర్ల్‌!


ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో పనిచేసే సేల్స్‌గర్ల్, ఆ స్టోర్‌ యజమానినే ప్రేమిస్తే ఏమవుతుంది?
- ఓ మంచి సినిమా అవుతుంది!
- అది మంచి హిట్టవుతుంది!

అలా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న సినిమానే ‘ఇట్‌’ (1927). ఇందులో నటించిన అందాల శృంగార తార క్లారా బౌ, అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ఆమెనంతా ‘ఇట్‌ గర్ల్‌’ అని పిలవడం ప్రారంభించారు. బ్రిటిష్‌ రచయిత్రి ఎలినార్‌ గ్లిన్‌ రాసిన రాసిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. కథేంటి: చాలా అందంగా ఉండే ఓ అమ్మాయి ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో పనిచేస్తుంటుంది. ప్రపంచంలోనే పెద్దదైన ఆ స్టోర్‌ యజమానిని చూసి ప్రేమలో పడుతుంది. కానీ అతడి దృష్టిలో పడ్డం ఎలా? అందుకోసం తన స్నేహితుడి సాయం తీసుకుని తన బాస్‌ డిన్నర్‌కి వెళుతున్న ఓ పెద్ద హోటల్‌కి తనూ వెళుతుంది. అక్కడ అతడి దృష్టిని ఆకర్షిస్తుంది. అతడే తన డేట్‌ అడిగేలా చేసుకుంటుంది. ఆపై ఇద్దరూ కలిసి విదేశాల్లోని ఓ అందమైన ప్రదేశానికి విహారానికి వెళతారు. అక్కడ అతడు అతి చొరవ తీసుకోబోతే చెంప ఛెళ్లుమనిపించి తిరిగి వచ్చేస్తుంది. ఓ సందర్భంలో స్నేహితురాలి కొడుకుకు వైద్యం అందేలా చేయడం కోసం తన కొడుకేనని చెప్పిన ఆమెను బాస్‌ అపార్థం చేసుకుని చులకన చేస్తాడు. తన కోరిక తీరిస్తే పెళ్లి తప్ప ఏదైనా ఇస్తాననని బేరం పెడతాడు. అవమానానికి గురై ఉద్యోగాన్ని కూడా వదిలేసి అతడికి నిజం తెలిసేలా చేయడం కోసం ఈసారి అతడు ప్రయాణిస్తున్న ఓడలో తనూ ప్రయాణిస్తుంది. అక్కడ ఆమె ఆకర్షణకు లోనైన అతడు ఆమెను లోబరుచుకోవడం కోసం పెళ్లికి సిద్ధమంటాడు. ‘నీ స్టోర్‌లో బాయ్‌నైనా చేసుకుంటాను తప్ప నిన్ను చేసుకోను’ అని ఆమె తిరస్కరిస్తుంది. ఆ తరువాత ఆమె గురించి నిజం తెలిసిన అతడు నిజంగానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. ఈ సినిమా ప్రభావంతో కథానాయిక క్లారా బౌ దశ తిరిగిపోయింది. ఈ ‘ఇట్‌ గర్ల్‌’ ఆపై 46 మూకీలు, 11 టాకీలతో తారా పథానికి దూసుకుపోయింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.