శాంతి గీతమా?... యుద్ధ సన్నద్ధమా?
article imageఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ఆరు నామినేషన్లు సాధించి సత్తా చాటింది బ్రిటిష్‌ చిత్రం ‘డార్కెస్ట్‌ అవర్‌’. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌, కాస్ట్యూమ్‌ డిజైన్‌, మేకప్‌ లాంటి సాంకేతిక విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారం కోసం పోటీపడుతోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ పోషించిన కీలక భూమిక ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చర్చిల్‌గా ప్రముఖ నటుడు గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ నటించారు. జో రైట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌కు ఆస్కార్‌ ఖాయమని సినీ విమర్శకులు బలంగా చెబుతున్న నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలు చూద్దాం.

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన రెండు చిత్రాలు ఈసారి ఆస్కార్‌ ఉత్తమ చిత్రం పురస్కారం కోసం బరిలో నిలిచాయి. అవే క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన ‘డంకర్క్‌’, బ్రిటిష్‌ చిత్రం ‘డార్కెస్ట్‌ అవర్‌’. బాక్సాఫీసు వద్ద ‘డార్కెస్ట్‌ అవర్‌’ ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల మెప్పు పొందింది. ముఖ్యంగా చర్చిల్‌ పాత్రలో గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. తన అభినయంతో గోల్డెన్‌ గ్లోబ్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ పురస్కారాలు గెలుచుకున్నారు ఓల్డ్‌మ్యాన్‌. బాఫ్టా పురస్కారాల్లో ఈ చిత్రానికి తొమ్మిది నామినేషన్లు దక్కాయి. 30 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి 124 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

కథేంటి: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అడాల్ఫ్‌ హిట్లర్‌ సారథ్యంలోని నాజీ సేనలు యూరప్‌ దేశాలను భయకంపితులను చేస్తుంటాయి. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న నాజీలు పశ్చిమ యూరప్‌ వైపు దూసుకొస్తుంటారు. పశ్చిమ యూరప్‌ భవితవ్యం అందులోని కీలక దేశమైన బ్రిటన్‌ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తాడు చర్చిల్‌. హిట్లర్‌తో శాంతి చర్చలు జరపడమా? లేదా తమ దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, సిద్ధాంతాల కోసం యుద్ధానికి సన్నద్ధం కావడమా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం చర్చిల్‌కు వస్తుంది. అప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆయన ప్రదర్శించిన రాజనీతి ఎలాంటిది? అన్న విషయాలు ‘డార్కెస్ట్‌ అవర్‌’లో ఆసక్తికరంగా ఆవిష్కరించారు.

విశేషాలు:
* ఒక ఏడాది పాటు చర్చిల్‌ గురించి అధ్యయనం చేసి ఓల్డ్‌మ్యాన్‌ తన పాత్రకు సిద్ధమయ్యాడట. సినిమా చిత్రీకరణ జరిగినన్నాళ్లూ చర్చిల్‌ పాత్రలో లీనమైపోయాడట. పేకప్‌ చెప్పాక ఇంటికెళ్లినా చర్చిల్‌లాగే ప్రవర్తించేవాడట. దీని గురించి ఓల్డ్‌మ్యాన్‌ భార్య గిసెలె ‘రోజూ రాత్రి మా ఇంటికి చర్చిల్‌ వస్తాడు. లేచేసరికి ఓల్డ్‌మ్యాన్‌గా మారిపోయుంటాడు’ అని సరదాగా వ్యాఖ్యానించింది.
* 2012లో వచ్చిన ‘టింకర్‌ టైలర్‌ సోల్జర్‌ స్పై’ చిత్రానికి తొలిసారి ఆస్కార్‌ ఉత్తమ నటుడి నామినేషన్‌ అందుకున్నారు ఓల్డ్‌మ్యాన్‌. అయితే అప్పుడు పురస్కారం దక్కలేదు. ఇప్పుడు ‘డార్కెస్ట్‌ అవర్‌’తో రెండో నామినేషన్‌ సాధించాడు. ఈసారి మాత్రం పురస్కారం ఖాయమని విమర్శకులు చెబుతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.