ఆస్కార్‌ అందుకున్న భావోద్వేగాలు

స్వార్థం మానవత్వానికి సవాలుగా నిలిచినా, చివరకు ప్రేమానురాగాలే గెలుస్తాయని చెప్పే సినిమా ‘డేస్‌ ఆఫ్‌ హెవెన్‌’ (1978). ప్రముఖ నటుడు రిచర్డ్‌ గేరే, అందాల తార బ్రూక్‌ ఆడమ్స్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు, కవితాత్మకంగా చిత్రాలను తీస్తాడనే పేరు పొందిన టెర్రెన్స్‌ మాలిక్‌ దర్శకుడు. ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఈ సినిమా కథలోకి తొంగి చూస్తే... ఓ మిల్లులో యజమానిని అనుకోకుండా చంపేసిన ఓ కార్మికుడు, తన స్నేహితురాలితో కలిసి మారుమూల ప్రాంతానికి పారిపోతాడు. అక్కడ ఓ ధనవంతుడి పొలంలో పనికి కుదురుతారు. ఆ ధనవంతుడు ఓ ఏడాదిలో చనిపోతాడని తెలుసుకున్న ఆ కార్మికుడు, తన స్నేహితురాలిని ఆ ధనవంతుడితో ప్రేమ నటించి పెళ్లి చేసుకోమని ప్రేరేపిస్తాడు. అతడెలాగూ ఏడాదిలో చనిపోతాడు కాబట్టి ఆస్తంతా ఆమెదవుతుందని, అప్పుడు ఇద్దరూ ఆనందంగా గడపవచ్చనేది వాళ్ల ఉద్దేశం. అనుకున్నట్టుగానే ధనవంతుడితో పెళ్లి అవుతుంది. కానీ ఆ ధనవంతుడి ఆరోగ్యం కుదుట పడుతుంది. పెళ్లి అయ్యాక ఆమె, ఆ ధనవంతుడిని నిజంగానే ప్రేమించడం మొదలుపెడుతుంది. ఈలోగా ఆ ధనవంతుడికి తన భార్య, ఆమె స్నేహితుడి పన్నాగం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చివరికి ఏమైందనేదే కథ. భావోద్వేగాల నడుమ కథ నడిపిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.