ఆసియాలోనే బ్లాక్‌బస్టర్‌
                           

హాంగ్‌కాంగ్‌లో తీసిన ఓ సినిమా ఆసియా ఖండంలోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మేటి వంద చైనా సినిమాల జాబితాలో రెండోస్థానం సంపాదించింది. తక్కువ బడ్జెట్‌లో ప్రచారం కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు తిరగరాసింది. హాంగ్‌కాంగ్, హాలీవుడ్‌ సినీ రంగాలపై ప్రభావం చూపించిన సినిమాగా గుర్తింపు పొందింది. ఆ సినిమనే ‘ఎ బెటర్‌ టుమారో’ (1986). దీని విజయంతో సీక్వెల్స్‌గా మరో రెండు సినిమాలు, ప్రీక్వెల్‌గా ఇంకో సినిమా వచ్చాయి. ఓ అన్నదమ్ముల కథగా ఇది నడుస్తుంది. అన్న మాఫియా ప్రపంచంలో నేరగాడైతే, తమ్ముడు పోలీసు అధికారి. ఇద్దరి మధ్య అనుబంధం, అన్న నేరస్తుడని తమ్ముడు తెలుసుకోవడం, అన్నని మార్చాలనుకోవడం, ఇద్దరి మధ్య విభేదాలు, అన్న మారాలనుకున్నా మారలేని పరిస్థితులు... ఇలాంటి నేపథ్యంలో సినిమా సాగుతుంది. బాలీవుడ్‌లో ‘దీవార్‌’లాంటి ఎన్నో సినిమాలను గుర్తు చేసే ఇది యువతపై ఎంతో ప్రభావం చూపించింది. ఇందులో స్మగ్లర్‌గా నటించిన వ్యక్తి ధరించిన లాంగ్‌కోట్‌లను ఒక ఫ్యాషన్‌గా యువత అనుసరించారు. ఆ నటుడు ధరించిన కళ్లజోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. హాంగ్‌కాంగ్‌ మొత్తంగా ఆ కంపెనీ కళ్లజోళ్లు మొత్తం అమ్ముడైపోయాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.