లేటు వయసులో ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రేమకథ
article imageఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ఆరు నామినేషన్లు సాధించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు లాంటి ప్రధాన విభాగాలతో పాటు ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ నామినేషన్లు ఈ చిత్రానికి దక్కాయి. ‘బూగీ నైట్స్‌’, ‘దేర్‌ విల్‌ బి బ్లడ్‌’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ అమెరికన్‌ దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. మూడు సార్లు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ పురస్కారం అందుకున్న డేనియల్‌ డే లెవిస్‌ ప్రధాన పాత్రలో నటించారు. లెస్లీ మాన్‌విల్లె, విక్కీ క్రిప్స్‌ కీలక పాత్రల్లో నటించారు. ఆ చిత్ర విశేషాలివీ.

ఆ సినిమా బడ్జెట్‌ 35 మిలియన్‌ డాలర్లు. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు సుమారు 17.5 మిలియన్‌ డాలర్లు. అంటే బొటాబొటిగా బడ్జెట్‌లో సగం మాత్రమే తిరిగొచ్చింది. కానీ ప్రశంసలు, పురస్కారాల విషయంలో మాత్రం ముందుంది. ఆ చిత్రమే ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’. ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్లు సాధించింది. బాఫ్టా పురస్కారాల్లో నాలుగు నామినేషన్లు అందుకుంది. టొరంటో, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌ చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు సాధించింది. అంతేకాదు.. 2017లో వచ్చిన పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం గమనార్హం. 1950 నేపథ్యంలో లండన్‌లోని ఓ వయసు మళ్లిన ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది.

కథేంటి: ఫ్యాషన్‌ డిజైనర్‌ రెనాల్డ్స్‌ వుడ్‌కుక్‌ (డేనియల్‌ డే లెవిస్‌) పెళ్లి చేసుకోకుండా వృత్తే జీవితంగా బతుకుతుంటాడు. ఆయనకు చెల్లెలు సిరిల్‌(లెస్లీ) అంటే ప్రాణం. ఎంతో మంది సుందరాంగులు రెనాల్డ్స్‌ను ఇష్టపడుతున్నట్లు చెప్పినా అసలు పట్టించుకోడు. అయితే ఓసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ వెయిట్రెస్‌గా పనిచేసే ఆల్మా(విక్కీ) అతణ్ని ఆకర్షిస్తుంది. క్రమంగా వారిద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరూ కలసి జీవిస్తుంటారు. అయితే రెనాల్డ్స్‌ది చిన్న చిన్న విషయాలకే గొడవపడే మనస్తత్వం. సరదాగా బయట డిన్నర్‌కు వెళ్దామని ఆల్మా అడిగితే కోపంతో అరిచేస్తాడు. రెనాల్డ్స్‌ ప్రేమను పొందడానికి ఆల్మా ఓ ప్లాన్‌ వేస్తుంది. అతను తాగే టీలో తక్కువ మోతాదులో విషం కలుపుతుంది. అనారోగ్యం పాలైన రెనాల్డ్స్‌కు సపర్యలు చేసి కోలుకొనేలా చేస్తుంది. తన పట్ల ఆల్మా చూపిస్తున్న ప్రేమను చూసి రెనాల్డ్స్‌ తనను పెళ్లి చేసుకుంటాడు. అయితే కొద్దిరోజుల తర్వాత పెళ్లి తన వృత్తిజీవితానికి అడ్డంకిగా మారిందని బాధపడ్తుంటాడు. తన జీవితంలో నుంచి ఆల్మాను పంపించేయాలని అనుకుంటాడు. అది తెలిసిన ఆల్మా రెనాల్డ్స్‌ తినే ఆమ్లెట్‌లో విషం కలుపుతుంది. ఈసారి రెనాల్డ్స్‌ ఆ విషయం ముందుగానే పసిగడతాడు. అప్పుడు ఆల్మా రెనాల్డ్స్‌తో ‘నువ్వు అనారోగ్యంగా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అప్పుడే నేను నీకు సపర్యలు చేసి ఒత్తిడి పోగొట్టగలను. తద్వారా నువ్వు వృత్తిపై మరింత శ్రద్ధ పెట్టగలవ’ని చెబుతుంది. అది విన్న రెనాల్డ్స్‌ ఆమ్లెట్‌ను తినేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’లో చూడాలి.

విశేషాలు:
* దర్శకుడు ఆండర్సన్‌ ఒకసారి అనారోగ్యం బారిన పడితే ఆయన భార్య దగ్గరుండి సేవలు చేసిందట. అప్పుడు ఆమె కళ్లలో తనపై కనిపించిన ప్రేమను చూశాక ఆయనకు ఈ కథాలోచన వచ్చిందట.
* డేనియల్‌ డే లెవిస్‌ ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే సినిమాల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆలెక్కన ఇదే అతని చివరి చిత్రం.
* ఆండర్సన్‌, డేనియల్‌ కలయికలో వచ్చిన రెండో చిత్రమిది. గతంలో వారు కలసి పనిచేసిన ‘దేర్‌ విల్‌ బి బ్లడ్‌’తో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు డేనియల్‌. దీంతో పాటు తాను అబ్రహం లింకన్‌ పాత్రలో నటించిన ‘లింకన్‌’, ‘మై లెఫ్ట్‌ ఫూట్‌’ చిత్రాలకూ ఆస్కార్‌ ఉత్తమ నటుడి పురస్కారాలు గెలుచుకున్నాడు డేనియల్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.