నిశ్శబ్ద చిత్రాల్లో ఓ మాస్టర్‌ పీస్‌!

సంక్లిష్టమైన సినిమా... అద్భుతమైన చిత్రం... చరిత్రలో నిలిచిపోయే సినిమా... మరో వందేళ్ల తరువాత కూడా తీయలేనంత గొప్ప చిత్రం...
-ఇలా ఎన్నో ప్రశంసలు అందుకున్న చిత్రం ‘ఇన్‌టోలెరెన్స్‌’. ఇది 1916 సెప్టెంబర్‌ 5న విడుదలైంది. దీన్ని తీసింది ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా పేరు పొందిన డి.డబ్ల్యూ.గ్రిఫిత్‌.ఈ సినిమా కథ 2500 ఏళ్ల కాలంలో వేర్వేరు సమయాలకు చెందినది. నాలుగు సమాంతర కథలను ఒకటిగా పెనవేసి చూపించిన సినిమా. మూడున్నర గంటల పాటు సాగే ఈ సినమా కథ సమకాలీనమైన 1916 నాటి క్రైమ్‌ డ్రామాగా సాగుతూనే, క్రీస్తు కాలానికి, 1572 నాటి ఫ్రెంచ్‌ చరిత్రకి, క్రీస్తుపూర్వం 539 నాటి బాబిలోనియా చక్రవర్తి కాలానికి ముడిపడి ఉంటుంది. అన్ని కాలాలను అనుసంధానిస్తూ మాతృత్వాన్ని ప్రధాన సూత్రంగా తీసుకుని ముందుకు సాగుతుంది. సినిమాలో వేర్వేరు కాలాలకు చెందిన సన్నివేశాలకు వేర్వేరు రంగుల నేపథ్యాన్ని ఎంచుకోవడం విశేషం. అధికారం, అసహనం, మతం, ద్వేషం, ఆధిపత్య ధోరణులు మానవాళికి ఎలా సవాలుగా మారాయో అంతర్లీనంగా చెప్పారు. ఈ సినిమాలో వేసిన భారీ సెట్టింగుల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. బాబిలోనియా చరిత్రను ప్రతిబింబించేలా 300 అడుగుల ఎత్తయిన కోట గోడలు, శిల్పాలు, 3000 మంది ఎక్స్‌ట్రా నటులతో భారీగా తీయడం అప్పట్లో ఒక వింత. అయితే ఈ చిత్రం ఎన్ని ప్రశంసలు పొందినప్పటికీ పెట్టుబడి ఎక్కువ కావడంతో దర్శ కనిర్మాత గ్రిఫిత్‌ను మాత్రం ఆర్థికంగా శిథిలం చేయడం బాధాకరం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.