ఒంటరి పిల్లాడి సాహసం

పెద్ద భవనంలో అందరూ సెలవులకి ఊరికి బయల్దేరుతారు... సమయం మించి పోతున్న హడావుడిలో ఓ ఎనిమిదేళ్ల పిల్లాడిని మాత్రం ఇంట్లోనే మర్చిపోతారు... ఆ పిల్లాడు పొద్దున్నే లేచేసరికి ఇళ్లంతా నిశ్శబం... భవనం మొత్తానికి ఒంటరిగా మిగిలిపోయానని అర్థమవుతుంది... మొదట భయమేసినా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చనుకుంటాడు... ఫ్రిజ్‌ నిండా పిజ్జాలు, ఆహారం బోలెడు... టీవీల్లో ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చూడవచ్చు... కానీ ఆ ఆనందం ఎంతో సేపు మిగలదు... ఎవరూ లేని ఆ ఇంట్లో దోపిడీకి ఇద్దరు దుండగులు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది... ఎలా? కానీ ఆ పిల్లాడు మామూలు వాడు కాదు... ఆ దుండగుల పని పట్టాలనుకుంటాడు... దొంగలు ఎలా లోపలికి వచ్చినా వాళ్లకి ఎదురు దెబ్బలు తగిలేలా అద్భుతంగా ఏర్పాట్లు చేసుకుంటాడు... ఇంకేముంది? ఆ దొంగల పాట్లు చూసి ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారు! ఈ కథంతా వినేసరికి ‘హోమ్‌ ఎలోన్‌’ సినిమా గుర్తొచ్చే ఉంటుంది. ఇంత సరదా కథ కాబట్టే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసులు కురిపించింది. 18 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో సినిమా తీస్తే, 476 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఒంటరి పిల్లాడిగా నటించిన మెకాలే కుల్కిన్‌ రాత్రికి రాత్రి పెద్ద ప్రముఖుడైపోయాడు. క్రిస్‌ కొలంబస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల విషయంలో అప్పట్లో గిన్నిస్‌ రికార్డు కూడా సాధించడం విశేషం. 10 నవంబర్‌న యుఎస్‌ఏలోని లాస్‌ఏంజెల్స్, ఇల్లినాయిస్‌లో ప్రీమియర్‌ షో వేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.