భూమ్మీద ఎలియన్స్‌ దండయాత్ర!
ఈ అనంతానంత విశ్వంలో భూమి ఒంటరిదేనా? కోటానుకోట్ల నక్షత్రాల చుట్టూ తిరిగే కోట్లాది గ్రహాల్లో ఎక్కడా జీవం లేదా? ఉంటే ఆ గ్రహాంతరవాసులు ఎలా ఉంటారు? మన కన్నా తెలివైన వాళ్లా?...ఈ ప్రశ్నలు తరతరాలుగా మానవుడిని తరుముతూనే ఉన్నాయి. అవి ఎన్నో ఊహలకు, పుస్తకాలకు, సినిమాలకు జీవం పోశాయి. అలాంటి ఊహల్లో ఒకటి... వేరే గ్రహం నుంచి మనకన్నా తెలివైన వాళ్లు, మనకన్నా సాంకేతిక అభివృద్ధి సాధించిన వాళ్లు వచ్చి భూమ్మీద దండెత్తితే? ఈ ఆలోచన ఓ హాలీవుడ్‌ సినిమాకు రూపాన్నిచ్చింది. అదే ‘ఇండిపెండెన్స్‌ డే’ (1996). ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌స్మిత్, బిల్‌ పాలమ్యాన్, జెఫ్‌ గోల్డ్‌బ్లమ్‌ తదితరులు నటించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. విపత్తులు, వైపరీత్యాల నేపథ్యంలో తీసే ‘డిసాస్టర్‌’ సినిమాలను ఎక్కువగా రూపొందించిన జర్మన్‌ దర్శకుడు రోనాల్డ్‌ ఎమ్మెరిచ్‌ తీసిన ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ఆస్కార్‌ అవార్డు అందుకుంది. దాదాపు 75 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 817.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 


కథ విషయానికి వస్తే... జులై 2న ప్రపంచ వ్యాప్తంగా సమాచార వ్యవస్థ స్తంభించి పోతుంది. ఫోన్లు, కంప్యూటర్లు ఏవీ పనిచేయడం మానేస్తాయి. కారణం ఓ భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించడమే. అది చంద్రుడి ద్రవ్యరాశిలో నాలుగో వంతు ఉండేంత పెద్దది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగానే అందులోంచి ఫ్లైయింగ్‌ సాసర్లు వచ్చి భూమ్మీద ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగ్టన్, ప్యారిస్, మాస్కో లాంటి ప్రాంతాల పైకి వచ్చి నిలుస్తాయి. వాటి మధ్య సమాచారం ఏదో సంకేతాల రూపంలో జరుగుతుంటుంది. ఇక భూమి మీద సందడి మొదలవుతుంది. ఆ సంకేతాలను డీకోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ భాషను ఓ సైంటిస్ట్‌ డీకోడ్‌ చేస్తాడు. దాని ప్రకారం ఆ అంతరిక్ష నౌక గ్రహాంతర వాసులది. వాళ్లు ఈ భూమిని నాశనం చేసి ఆక్రమించడానికి వచ్చారు. ఇక హడావుడి బయల్దేరుతుంది. ఆ ఎలియన్స్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నాలు చేస్తారు. జులై 4 అమెరికా ఇండిపెండెన్స్‌ డే. అదే రోజు మానవాళి తమ ప్రాణాల కోసం, నిజమైన స్వేచ్ఛ కోసం అంతరిక్ష వాసులతో పోరాడాల్సి వస్తుంది. మన దగ్గర ఆధునిక ఆయుధలేమీ లేవు... ఒక్క ఆత్మ విశ్వాసం తప్ప. ప్రణాళిక ఏదీ లేదు... ఒక్క ప్రాణాలు కాపాడుకోవాలనే తెగింపు తప్ప. రకరకాల మార్గాల ద్వారా ఆ ఎలియన్స్‌ని ఎదుర్కొంటారు. అంతిమ యుద్ధం మొదలైంది. మరి... తర్వాత ఏమైంది? ఆ ఎలియన్స్‌ తోక ముడిచారా, లేదా? అదే సినిమా.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.