ఓ యువకుడి అసాధారణ జీవితం

సంపన్నులైన తల్లిదండ్రులు... ఆత్మీయత గల కుటుంబం... ఇలాంటి నేపథ్యంలోంచి వచ్చిన ఏ మామూలు యువకుడైనా ఏం చేస్తాడు? హాయిగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడి, జీవితాన్ని సుఖంగా, ఆనందంగా గడిపేస్తాడు. కానీ... క్రిస్టోఫర్‌ మెక్‌కాండిల్స్‌ మామూలు యువకుడు కాడు. ఈ బంధాలు, బాధ్యతల జీవితం నుంచి బయటపడి తనేంటో తాను తెలుసుకోవాలనుకున్నాడు. నిజమైన స్వేచ్ఛను అనుభవించాలనుకున్నాడు. అన్నీ వదిలేసి అడవులు, కొండలు, కోనలు, నదులు దాటుకుంటూ నచ్చిన పని చేస్తూ నచ్చిన చోట ఉంటూ తనకు నచ్చినట్టు దేశమంతా తిరిగాడు. ఆ యువకుడి కథను అమెరికా రచయిత ‘ఇన్‌ టు ద వైల్డ్‌’ అనే పుస్తకంగా రాశాడు. అందరినీ ఆకట్టుకున్న ఆ పుస్తకం ఆధారంగా అదే పేరుతో 2007లో ఓ సినిమా తీస్తే అది జనాదరణ పొందడంతో పాటు అనేక పురస్కారాలు అందుకుంది. కాలేజీలో డిగ్రీ పూర్తయ్యాక అమ్మానాన్నా కానుకగా ఇచ్చిన కొత్త కారును తిరస్కరించిన మెక్‌కాండిల్‌్్స, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా, తన గుర్తింపు కార్డులన్నీ చింపేసి, తను దాచుకున్న డబ్బంతా దానం చేసి, ఏమీ లేకుండా ఉత్తర అమెరికా అంతా తిరగాలని బయల్దేరుతాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించుకోవడం, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ నచ్చిన చోటుకి సాగిపోవడం... ఇదీ అతడి లక్ష్యం. ప్రకృతితో మమేకమై జీవితం గడపాలనే ఉద్దేశంతో అడవులు, కొండలు, కోనల్లో సాహసాల ప్రయాణం మొదలు పెడతాడు. మధ్యలో ఎందరినో కలుసుకుంటాడు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటాడు. అతడి అసాధారణ ప్రయాణమే కథగా తీసిన ఈ సినిమాను 20 మిలియన్‌ డాలర్లతో తీస్తే, 56 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.