నవ్వుల జేమ్స్‌బాండ్‌

జేమ్స్‌బాండ్‌ సినిమాలనగానే ప్రపంచాన్ని ఏ దుండగుడి నుంచో కాపాడే గూఢచారి, వ్యూహ ప్రతివ్యూహాలు, ఛేజింగ్‌లు, పోరాటాలు... ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ అలాంటి గంభీరమైన జేమ్స్‌బాండ్‌ పాత్రతో నవ్వులు కురిపించిన సెటైర్‌ సినిమా ఒకటి వచ్చింది. అదే ‘క్యాసినో రాయేల్‌’ (1967). కొలంబియా పిక్చర్స్‌ నుంచి స్పై కామెడీ ఫిల్మ్‌గా విడుదలైన దీన్ని బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ మొదటి నవలను సూత్రప్రాయంగా తీసుకుని రూపొందించారు. ఇందులో బాండ్‌గా డేవిడ్‌ నివెన్‌ నటించాడు. ఇరవై ఏళ్ల క్రితమే రిటైర్‌ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్న బాండ్‌ అవసరం మళ్లీ పడుతుంది. అంతర్జాతీయ గూఢచారులు చాలామంది అంతుపట్టకుండా అదృశ్యమైపోతుండడంతో ఆ సమస్యను పరిష్కరించడానికి బాండ్‌ను రంగంలోకి దింపుతారు. అప్పుడు బాండ్‌ ఓ అరడజను మంది గూఢచారులకు ‘జేమ్స్‌బాండ్‌’ పేరు పెట్టి వదులుతాడు. విలన్లు అయోమయంలో పడిపోయి ఎవరు నిజమైన బాండో తెలియక తికమక పడడం, బాండ్‌ పాత్రధారులందరూ నిజమైన జేమ్స్‌బాండ్‌ను అనుకరిస్తూ నటించడం లాంటి సన్నివేశాలతో నవ్వులు పండుతాయి. దీన్ని అయిదో జేమ్స్‌బాండ్‌ సినిమా ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’ సినిమాకు రెండు నెలల ముందు విడుదల చేశారు. బాండ్‌ సినిమాలపై సెటైర్‌గా తీసిన ఈ సినిమాను 12 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీయగా, ఇది 41.7 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి విజయవంతమైంది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.