జూ నుంచి తప్పించుకుంటే?

 

కొన్ని జంతువులు జంతు ప్రదర్శన శాల (జూ) నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతే ఏమవుతుంది? ఏముందీ, హాయిగా ఉంటాయంటారా? తప్పు. జూలోనే పుట్టి పెరిగిన జంతువులకు అడవిలో వేటాడ్డం ఎలా తెలుస్తుంది? జూలో సమయానికి ఆహారం వచ్చిపడిపోతుంది. అలా వచ్చేపోయే వారిని చూస్తూ కాలం గడిపేవి కాస్తా, అడవిలో కొత్తగా జీవించాల్సి రావడం కష్టమే. ఈ ఆలోచనే ఓ సినిమాకి నాంది పలికింది. అదే ‘మడగాస్కర్‌’. కంప్యూటర్‌ యానిమేటెడ్‌ అడ్వెంచర్‌ కామెడీ సినిమాగా 2005లో విడుదలైన ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్ని, పిల్లల్ని ఆకర్షించింది. డ్రీమ్‌వర్క్స్‌ సంస్థ నుంచి ఎరిక్‌ డార్నెల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 75 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 532.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.


న్యూయార్క్‌లోని సెంట్రల్‌ జూ పార్క్‌లోని కొన్ని జంతువులకు జీవితం బోర్‌ కొడుతుంది. ఎప్పుడూ తినడం, పడుకోవడం, ఉన్నచోటే తిరగడం విసుగెత్తిపోయి వాటిలో అవి మాట్లాడుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాయి. అలా జిరాఫీ, సింహం, జీబ్రా, నీటి గుర్రం ఆలోచించి కొన్ని పెంగ్విన్లు, రెండు చింపాంజీలతో కలిసి సాహసం చేస్తాయి. మరి వాటి ప్రయాణం ఎలా సాగింది? అడవిలో అవి అక్కడే పుట్టి పెరిగిన వన్యప్రాణులతో కలిసిపోగలిగాయా? తిరిగి జూయే నయం అనుకున్నాయా? అనేదే కథ. హాయిగా నవ్వించే ఈ సినిమా విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా ‘ఎస్కేప్‌ టు ఆఫ్రికా’ (2008), ‘యూరప్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ (2012), ‘పెంగ్విన్స్‌ ఆఫ్‌ మడగాస్కర్‌’ (2014) సినిమాలు వచ్చాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.