లాస్‌ ఏంజెలిస్‌లో లావా!

ఎప్పుడూ హడావిడిగా, వాహనాల ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే మహానగరం మధ్యలో అగ్నిపర్వతం బద్దలై, లావా పెల్లుబికితే? ఆ ఊహే భయానకంగా ఉంటుంది. అలాంటి ఊహ నిజమైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన సినిమా ‘వాల్కనో’ (1997). తుపాను, సునామీ, టోర్నెడోల్లాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వీటిని డిజాస్టర్‌ సినిమాలంటారు. లాస్‌ ఏంజెలిస్‌ మహానగరంలోని ఓ పార్క్‌లోంచి ఉన్నట్టుండి అగ్నిపర్వతం బద్దలై, అత్యధిక ఉష్ణోగ్రతతలో ఉండే చిక్కని లావా ఓ నదిలాగా ప్రవహించడం మొదలైతే ఎలా ఉంటుందో, ఆ లావా ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం ‘డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ బృంద సభ్యులు ఎలాంటి ప్రణాళికలు వేశారో, సామాన్య ప్రజలు ఎలా గగ్గోలు పెట్టారో... ఇలాంటి సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. సినిమాలో లావా విరజిమ్మడం, అగ్ని పర్వతం విస్ఫోటనాలు వెదజల్లడం లాంటి దృశ్యాలను అత్యంత సహజంగా చిత్రీకరించారు. చిత్రమేమిటంటే, లావా నేపథ్యంలో ఒకే ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విడుదలకు రెండు నెలల ముందు ‘డాంటేస్‌ పీక్‌’ అనే మరో సినిమా విడుదలైంది. రెండూ ప్రేక్షకాదరణ పొందడం మరో విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.