
ఆ సినిమా పేరు ‘మ్యాన్యుస్క్రిప్ట్’. ఇంకో రెండు నెలలకు కానీ నిర్మాణంలోకి ఈ చిత్రం రాదు. అయినా, ఇది ఇప్పటికే హాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. మోర్గాన్ ఫ్రీమ్యాన్, ఈ చిత్రంలో జైల్లో ఉన్న ఒక జీనియస్‌గా నటిస్తున్నాడు. అతను, జైలు బయట ఉన్న ఒక సాధారణ రచయితకు ఎక్కడినుండో ఒక మిస్టరీ బుక్నుంచి కొన్ని అధ్యాయాలను పంపిస్తూ ఉంటాడు. అవి అందుకుని, చదువుకుంటున్న ఈ బయటి రచయితకి, చాలా క్లూలు, దొరుకుతూ ఉంటాయి. వాటి ఆధారంతో అతను, దాదాపు వంద మిలియన్ డాలర్ల విలువ చేసే దొంగ వజ్రాల ఆచూకీ, అర్థమవుతూ వస్తుంది. మరి, ఈ క్లూల సాయంతో, బయటి రచయిత, నిజంగానే ఆ డబ్బు పొందుతాడా, అందులో ఆ జీనియస్‌కు వాటా ఇస్తాడా, అసలు ఆ జీనియస్ ఈ రచయతనే ఎందుకు ఎంచుకున్నాడు, ఆ మిస్టరీ బుక్ మిస్టరీ ఏమిటి... వంటి అనేక సందేహాలకు సమాధానాలు కావాలంటే, మనం ఆ ‘మ్యాన్యుస్క్రిప్ట్’ చిత్రాన్ని చూసి తీరాల్సిందే! బయటి రచయితగా స్కాట్ ఈస్ట్‌వుడ్ నటిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి జాన్ మూర్ దర్శకుడని అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ ఛెయిర్లోకి నిక్ కాసవెటస్ వచ్చి కుదురుకున్నాడు. అంటే, డైరెక్టర్ మారాడన్నమాట! న్యూ ఆర్లియన్స్ రాష్ట్రంలో వచ్చే ఏప్రెల్ (2018)లో షూటింగ్ ఆరంభం అవుతుంది. ‘మ్యాన్యుస్క్రిప్ట్’ సినిమాకు స్క్రిప్ట్‌ను లూయీ రోజెన్బెర్గ్, జో రోజెన్బామ్లు సమకూరుస్తున్నారు.