ఆశ్చర్యపరిచిన యాక్షన్‌ కామెడీ

పెట్టుబడి కేవలం 4.3 మిలియన్‌ డాలర్లు... రాబడి... ఏకంగా 300 మిలియన్‌ డాలర్లు!ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ ‘నా ఫేవరెట్‌ సినిమా’గా మెచ్చుకోవడం విశేషం!!
అనూహ్యమైన విజయంతో నిర్మాతలనే ఆశ్చర్యపరిచిన ఆ సినిమా ‘స్మోకీ అండ్‌ ద బాండిట్‌’ (1977). పైగా దర్శకుడు స్టంట్‌మ్యాన్‌ హాల్‌ నీధమ్‌కు ఇదే తొలి సినిమా. పెట్టిన డబ్బు వస్తే చాలనుకుని ఏవో కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేసిన ఈ సినిమాను, ప్రేక్షకాదరణను బట్టి మరిన్ని చోట్ల విడుదల చేశారు. ఓ పెద్ద ట్రక్కు నిండా బీర్‌ బాటిల్స్‌ను టెక్సాస్‌ నుంచి అట్లాంటాకు దొంగ రవాణా చేయడానికి ఓ వ్యాపారి పెద్ద మొత్తాన్ని ఎర చూపించి ఇద్దరు దొంగలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. నిర్ణీత సమయానికి లోడ్‌ను చేరిస్తే దాన్ని చట్టబద్ధంగా అమ్ముకోవచ్చనేది ఆ వ్యాపారి ఆశ. డబ్బుకు ఆశపడిన దొంగలు ఆ ట్రక్కును వేగంగా నడుపుతూ మధ్యలో అనుకోకుండా ఓ పెళ్లి కూతురికి లిఫ్ట్‌ ఇస్తారు. పెళ్లి పీటల మీంచి పారిపోయిన ఆమె ఓ పెద్ద న్యాయాధికారి కూతురు. ఇక అక్కడి నుంచి ఆ ట్రక్కు ప్రయాణం ఎలా సాగిందనేదే సినిమా. పోలీసుల ఛేజింగ్‌లు, పెళ్లి కూతురు కోసం గాలింపులు, ఓ పక్క ముంచుకొస్తున్న సమయం... ఈ పరిస్థితులు మధ్య యాక్షన్‌ కామెడీగా సినిమా సాగుతుంది. ఈ సినిమా విజయవంతమవడంతో దీనికి కొనసాగింపుగా 1980, 1983ల్లో మరో రెండు సినిమాలు వచ్చాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.