* ప్రేమకు బీమా!

జీవిత బీమా తెలుసు... ఆస్తులపై బీమా తెలుసు... కానీ ప్రేమకు బీమా గురించి తెలుసా? తెలుసుకోవాలంటే ఓ నవల చదవాలి. మూడు సినిమాలు చూడాలి. ఎందుకంటే పాఠకాదరణ పొందిన ఆ నవల ఆధారంగా మూడు సినిమాలు వచ్చాయి మరి. అమెరికా రచయిత ఎర్ల్‌ డెర్‌ బిగర్స్‌ ‘లవ్‌ ఇన్స్యూరెన్స్‌’ పేరుతో 1914లో ఓ నవల రాశాడు. దాని ఆధారంగా 1919లో అదే పేరుతో ప్యారమౌంట్‌ సంస్థ వాళ్లు ఓ మూకీ సినిమాను తీశారు. ఆ తర్వాత 1925లో ‘ద రెక్‌లెస్‌ ఏజ్‌’ పేరుతో యూనివర్శల్‌ సంస్థ వాళ్లు మరో సినిమా తీశారు. తిరిగి ఇదే నవల ఆధారంగా 1940లో ‘వన్‌ నైట్‌ ఇన్‌ ట్రోపిక్స్‌’ అనే టాకీ సినిమాను తీశారు. ఈ మూడో సినిమా తొలి ప్రదర్శన ఇదే రోజు జరిగింది.
ఇంతకీ ప్రేమకి బీమా ఏంటి? ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఆ అబ్బాయి స్నేహితుడు ఓ బీమా ఏజెంట్‌. అతడొక ప్రతిపాదన చేస్తాడు. వాళ్ల పెళ్లి కానీ ఆగిపోతే ఒక మిలియన్‌ డాలర్లు చెల్లించే విధంగా బీమా తీసుకోమనేదే ఆ ప్రతిపాదన. ఎలాగూ పెళ్లికి అంతా సిద్ధమైపోయింది కాబట్టి, స్నేహితుడి కోసం బీమా తీసుకుంటాడా అబ్బాయి. అయితే అనుకోకుండా ఆ అబ్బాయి మాజీ స్నేహితురాలు రంగంలోకి వస్తుంది. దాంతో అబ్బాయి, అమ్మాయిల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు బీమా కంపెనీ కంగారు పడి, ఆ ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగించి వాళ్ల పెళ్లి జరిగేలా చూడ్డం కోసం ఇద్దరు వ్యక్తులను ప్రత్యేకంగా నియమిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా హాస్యభరితంగా నడుస్తుంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.