తొలి ఆస్కార్‌ వేడుకలు!


ప్ర
పంచ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక మొట్ట మొదటి సారిగా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆస్కార్‌ తొలి వేడుకలు 1929, మే 16న లాస్‌ ఏంజెలిస్‌లోని హాలీవుడ్‌ రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో జరిగాయి. ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 1927, 1928 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలకు ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేశారు. అప్పట్లో ఈ వేడుకలకు టికెట్‌గా 5 డాలర్లను (2018 లెక్కలకు సరిచేస్తే ఈ మొత్తం 73 డాలర్లకు సమానం) నిర్ణయించారు. ఆనాటి వేడుకకు 270 మంది హాజరయ్యారు. రేడియోలో కానీ, టీవీలో కానీ ప్రసారం జరగని ఏకైక ఆస్కార్‌ వేడుక అదే. ఎందుకంటే రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రక్రియ 1930లో కానీ అందుబాటులోకి రాలేదు. ఈ వేడుకల్లో 12 విభాగాల్లో బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతుల్లో అధిక భాగాన్ని ‘సెవెంత్‌ హెవెన్‌’, ‘సన్‌రైజ్‌’ సినిమాలు పంచుకున్నాయి. ఇవి రెండూ చెరో మూడు ఆస్కార్లు అందుకున్నాయి. మరో రెండు ఆస్కార్‌లను ‘వింగ్స్‌’ సినిమా అందుకుంది. ఉత్తమ నటుడిగా ఎమిల్‌ జానింగ్స్‌ (ద లాస్ట్‌ కమాండ్‌), ఉత్తమ నటిగా జానెట్‌ గేనర్‌ (సన్‌రైజ్‌) నిలిచారు. ప్రముఖ హాస్యనటుడు చార్లీచాప్లిన్‌కు ‘ద సర్కస్‌’ సినిమాకు గాను గౌరవ పురస్కారాన్ని అందించారు. అప్పట్లో అకాడమీ అవార్డ్స్‌ అని పిలిచే ఈ వేడుక మొత్తం వ్యవహారం 15 నిమిషాల్లో ముగిసింది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.