2021 ఏప్రిల్‌కి వాయిదా పడిన ఆస్కార్‌ వేడుక!

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అంతా సవ్యంగా అనుకున్న సమయానికే జరగాల్సిన సినిమా ఉత్సవం ఆస్కార్‌ వేడుక కూడా ఈసారి ఏప్రిల్‌ 25, 2021కి వాయిదా పడింది. ఎందుకంటే ఇప్పటికే విడుదల కావాల్సిన చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమాలు ఈ ఆస్కార్‌ వేడుకలో నమోదు కావాల్సి ఉంటుంది. ఆస్కార్‌ వేడుకలో పోటీకి ప్రవేశించే అర్హాత సమయాన్ని ఎంట్రీ సమయాన్ని డిసెంబర్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021వరకు పొడగించారు. తాజాగా ఈ విషయంపై అకాడమీ అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌, ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ స్పందిస్తూ...‘‘సినిమా ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ఆనందింపజేయడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించాయి. అలాంటి సినిమాలను వేడుకల్లో గుర్తుచేసుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం అనుకున్న సమయానికి చిత్రాలు విడుదల కాకపోవడం చేత అవార్డుల కార్యక్రమం తేదీని పొడగించడం ఎంతైనా అవసరం. అయితే అనుకున్న సమయానికే కొన్ని చిత్రాలను పూర్తి చేసి విడుదల చేయవలసి ఆవశ్యకత నిర్మాతలపైన కూడా ఉందని..’’పేర్కొన్నారు. ఉత్తమ చిత్రాల ఎంపిక నామినేషన్ల సంఖ్యను 10 చిత్రాలకు ప్రామాణికరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వేడుకను రెండు నెలలు పెంచాలని కూడా అకాడమీ నిర్ణయం తీసుకుంది.

ఇందులో నామినేషన్ల సంఖ్య కూడా మారవచ్చు. అలాగే థియేటర్ల్లో విడుదల కాకుండా ఓటీటీలో విడుదలైన చిత్రాలు కూడా 2021 ఆస్కార్‌ వేడుకకు నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని అకాడమీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్‌ అవార్డుల వేడుకలను, అకాడమీ తన నూతన మ్యూజియం ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేయాలని నిర్ణయించింది. అకాడమీకి చెందిన మ్యూజియం కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. ఇది కూడా వచ్చే ఏడాది ఏప్రిల్లోనే ప్రారంభించనున్నారు. ఆస్కార్‌ అవార్డుల వేడుక ఇప్పటి వరకు 3సార్లు వాయిదా పడ్డాయి. వాటిలో మొదటిది 1938లో లాస్ ఏంజిల్స్ వరద కారణంగా, తరువాత, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తరువాత 1968 లో, అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ హత్యాయత్నం తరువాత 1981లో. ఇప్పుడు కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జేమ్స్ బాండ్ చిత్రం "నో టైమ్ టు డై", క్రిస్టోఫర్ నోలన్ "టెనెట్’ వంటి ప్రధాన చిత్రాలు కూడా తమ విడుదల తేదీని మార్చుకున్నాయి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.