ఆ సినిమా ఓ అద్భుతం!

ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన బీబీసీ వాళ్లు రెండు సంవత్సరాల కిత్రం ఓ అంతర్జాతీయ సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగా ‘ప్రపంచంలోనే అత్యంత గొప్ప విదేశీ చిత్రం ఏది?’ అని అడిగితే, అత్యధికమైన ఓట్లు ఓ సినిమాకి పడ్డాయి. ఆ సినిమా ఏంటో తెలుసా? జపాన్‌ వాళ్ల ‘సెవెన్‌ సమురాయ్‌’. ఎప్పుడో 1954 నాటి ఈ సినిమాను ఈనాటికీ అత్యధికులు గుర్తు పెట్టుకున్నారనడానికి ఈ సర్వే ఓ నిదర్శనం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? అంతర్జాతీయంగా మేటి దర్శకుడిగా పేరొందిన అకిరా కురొసావా. ఎన్నో మంచి సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని జనం కొన్నాళ్లు గుర్తుపెట్టుకుని వదిలేస్తారు. కానీ ఈనాటికీ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను గుర్తుపెట్టుకున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. జపాన్‌లో 1586 ప్రాంతంలో జరిగిన ఓ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆధారంగా ఎన్నో రీమేక్‌లు, అనుకరణలు, అనుశీలనలు ఎన్నో భాషల్లో వచ్చాయి.


కథ విషయానికి వస్తే... బందిపోటు దొంగలు దాడి చేయబోతున్నారని తెలిసి ఓ పల్లెటూరి వాళ్లు, వారిని ఎదుర్కోడానికి ఎలా సిద్ధమయ్యారనేదే కథ. ఆనాటి కాలంలో బందిపోట్ల దొంగల బెడద అధికంగా ఉండేది. బందిపోటు దొంగలు దాడికి సిద్ధమైతే, వాళ్ల నాయకుడు కొన్నాళ్లు ఆగుదామని, అప్పటికి పంటలన్నీ పండుతాయని చెబుతాడు. ఈ సంభాషణ విన్న ఆ పల్లెటూరి యువకుడు తన గ్రామస్థులను అప్రమత్తం చేస్తారు. అప్పుడు వాళ్లందరూ తమ రక్షణ కోసం వృద్ధుడైన ఓ ‘సమురాయ్‌’ని సంప్రదిస్తారు. సమురాయ్‌ అంటే యుద్ధవీరుడు అని అర్థం. ఆ సమురాయ్‌ తనలాంటి ఏడుగురు సమురాయ్‌లను ఓ బృందంగా తయారు చేస్తే వాళ్లందరినీ గ్రామస్థులు పోషించడానికి సిద్ధమవుతారు. ఆ ఏడుగురూ కలిసి గ్రామస్థులకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తారు. ఆయుధాలు ఉపయోగించడం, వ్యూహాలు పన్నడంలో రాటు దేలుస్తారు. చివరకు అందరూ కలిసి ఊరిపైకి ఆయుధాలతో దండెత్తి వచ్చిన 40 మంది బందిపోట్లను ఎలా ఎదుర్కొని తరిమికొట్టారనేదే కథ. ఈ కథ వినగానే బాలీవుడ్‌లో వచ్చిన ‘షోలే’ గుర్తొచ్చిందా? నిజానికి ఈ సినిమా ఆధారంగా ఒక్క ‘షోలే’ మాత్రమే కాదు, ‘ద గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌’, ‘ద మ్యాగ్నిఫిషియెంట్‌ సెవెన్‌’, ‘ఎ బగ్స్‌ లైఫ్‌’, ‘ద ఇన్విజిబుల్‌ సిక్స్‌’ లాంటి ఎన్నో సినిమాలు రూపొందాయి. ఈ సినిమాను అకిరా కురొసావా తెరకెక్కించిన విధానాన్ని ఈనాటికీ గొప్పగా చెప్పుకుంటారు. సినిమాను తీయడానికి అప్పట్లోనే వేర్వేరు కోణాల్లో ఎక్కువ కెమేరాలను దర్శకుడు ఉపయోగించడం విశేషం. ఈ సినిమాను జపాన్‌ కరెన్సీ ప్రకారం 125 మిలియన్‌ యెన్‌లతో తీస్తే అప్పట్లోనే 268 మిలియన్‌ యెన్‌లను ఆర్జించింది. వీడియోలు, సీడీలు, డీవీడీలు, డిస్క్‌లు, బ్లూరేలలో ఇప్పటికీ ఈ సినిమా అమితంగా అమ్ముడుపోతుండడం విశేషం. కథనంలోను, సృజనాత్మక చిత్రీకరణలోను, సాంకేతికంగాను ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా దీన్ని పేర్కొంటారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.