ఆడవాళ్ల వేషం...అగచాట్ల హాస్యం!

బీబీసీ వాళ్లు రెండేళ్ల కిత్రం 52 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ‘సినీ చరిత్రలోనే అత్యుత్తమ హాస్యం చిత్రం’గా ఓ సినిమాకు అందరూ ఓటేశారు! అమెరికా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు ‘వందేళ్లు... వంద మేటి హ్యాస్య చిత్రాలు’ జాబితాలో ఆ చిత్రం స్థానం సంపాదించింది! బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు ‘14 ఏళ్ల కల్లా విధిగా అందరూ చూడాల్సిన నవ్వుల చిత్రం’గా దాన్ని గుర్తించారు! అవును మరి, ఆ సినిమా మామూలుదా? ప్రపంచ ప్రఖ్యాత అందాల తార మార్లిన్‌ మాన్రో అద్భుతంగా నటించిన సినిమా! ప్రముఖ హాలీవుడ్‌ నటులు టోనీ కర్టిస్, జాక్‌ లెమ్మన్‌ నటించిన సినిమా. ఇక దర్శకుడో... హాలీవుడ్‌ స్వర్ణయుగంలో గొప్ప దర్శకుడిగా పేరుఒందిన బిల్లీ వైడర్‌.  - ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ సినిమా ‘సమ్‌ లైకిట్‌ హాట్‌’ (1959). ఫ్రెంచి సినిమా ‘ఫేన్‌ఫేర్‌ ఆఫ్‌ లవ్‌’ (1935) సినిమాకు రీమేక్‌.

సినిమా కథలోనే హాస్యం తొణికిసలాడతుంది. ఇద్దరు సంగీత కళాకారులు ఓ హత్యను చూసి, ఆ నేరస్థులు తరుముతుంటే తప్పించుకోడానికి ఆడవాళ్ల వేషాలు వేసుకుని... ఓ మహిళల బ్యాండ్‌లో ప్రవేశిస్తారు. ఆ బ్యాండ్‌లో ఓ అందాల కళాకారిణి మార్లిన్‌ మన్రో. ఆమె అందాన్ని చూసి మనసు పారేసుకున్న ఇద్దరూ, ఆమెకు చేరువవడానికి పోటీ పడతారు. ఇంతలో ఓ సంపన్నుడు, ఈ ఇద్దరు మగవారిలో ఒకరిని నిజంగా మహిళే అనుకుని ప్రేమలో పడతాడు. ఇలాంటి కథలో అడుగడుగునా నవ్వులు చిందుతాయనడంలో సందేహం ఏముంటుంది? చుట్టూ ఆడవారి మధ్య, ఆడవారి వేషంలో మగవాళ్లు... వాళ్లకు కలిగే ఇబ్బందులు... తమ వేషం బయటపడిపోకుండా వాళ్లు పడే తంటాలు... ఈ మధ్యలో ప్రేమ ప్రయత్నాలు... వీటికి తోడు సంగీత ప్రదర్శనల సందడి... ఇలా హాస్య భరితంగా సాగుతుంది సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ సినిమా, 2.9 మిలియన్ల పెట్టుబడికి, ఏకంగా 40 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, రైటర్స్‌ గిల్డ్, లారెల్, బాంబీ లాంటి అవార్డులెన్నో గెలుచుకుంది.

కొన్ని విశేషాలు...

- ఈ సినిమాలో మార్లిన్‌ మాన్రో పాత్ర పేరు ‘సుగర్‌ కేన్‌’. ఓ సన్నివేశంలో ‘ఇట్స్‌ మి, సుగర్‌’ అనే డైలాగ్‌ చెప్పడానికి మార్లిన్‌ మాన్రో 47 టేకులు తీసుకుంది. ఆఖరికి ఆ డైలాగ్‌ను పెద్దగా రాయించి, ఆమె ఎదురుగా పెడితే షాట్‌ ఓకే అయింది.

- సినిమాలో ఆడవేషాలు వేసిన నటులు ముందుగా మేకప్‌ చేసుకుని బయటకు వెళ్లి మహిళలు తిరిగే ప్రదేశాల్లో తిరిగి, వాళ్లతో పాటు మేకప్‌లు వేసుకుని ఎవరూ తమను గురించలేదని నమ్మకం కుదిరాకే ధైర్యంగా నటించారు.

- సినిమా ప్రివ్యూలో ప్రేక్షకులు విపరీతంగా నవ్వడం వల్ల కొన్ని డైలాగ్‌లు వినబడడం లేదని గుర్తించి, ఆయా సన్నివేశాలను రీషూట్‌ చేసి, ఆ డైలాగ్‌ల మధ్య కొంత గ్యాప్‌ ఉండేలా మళ్లీ తీయడం విశేషం.

- సినిమా చిత్రీకరణ సమయానికి మార్లిన్‌మాన్రో గర్భవతి కావడంతో ఆమెకు పెద్ద పెద్ద గౌన్లు వేశారు.

 Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.