మూకీ, టాకీల మధ్య ప్రేమ కథ!

ఈ  సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి...
1. అది 2011లో పూర్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసింది!
2. కథా కాలం 1927 నుంచి 1932 వరకు జరిగింది!
3. మూకీల నుంచి టాకీలు వస్తున్న కాలం నాటి కథ!
4. అయిదు ఆస్కార్, మూడు గోల్డెన్‌గ్లోబ్, 
5. కేవలం 15 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తీస్తే 133.4 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది!
6 బాఫ్టా, ఆరు ఫ్రెంచి సీజర్‌ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది!

ఫ్రెంచి దర్శకుడు మిచెల్‌ హజానవిసియస్‌ తీసిన ఆ సినిమా ‘ద ఆర్టిస్ట్‌’.

ఇన్ని అవార్డులు, ప్రశంసలు పొందిన ఆ సినిమా కథేంటి? మూకీల కాలంలో ఓ స్టార్‌ నటుడు ఓసారి ప్రీమియర్‌ ప్రదర్శనకు వస్తాడు. ఆ సందడిలో ఓ అందమైన అమ్మాయి హఠాత్తుగా వచ్చి ఆ నటుడిని వాటేసుకుని బుగ్గమీద ముద్దు పెడుతుంది. మర్నాడు పత్రికల్లో ఆ ఫొటోను ప్రచురించి ‘ఎవరీ అమ్మాయి?’ అనే కథనాలు వస్తాయి. ఆ అమ్మాయి మర్నాడు ఓ డ్యాన్స్‌ పోటీలకు ఆడిషన్స్‌కి వస్తే ఆ హీరో చూసి, తన తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తాడు. నటన నేర్పించి తీర్చిదిద్దుతాడు. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ లోగా సినిమాలు టాకీలుగా మారుతాయి. ఆమెకు అవకాశాలు వచ్చి పెద్ద స్టార్‌ అయిపోతే, ఆ మూకీల హీరో కనుమరుగైపోతాడు. ఆఖరికి తాగుడుకి బానిసై ఆత్మహత్యకు కూడా పాల్పడతాడు. ఆ దశలో ఆ అమ్మాయి అతడిని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లి కోలుకునేలా చేసి, తన నిర్మాతలతో మాట్లాడి, అతడి డ్యాన్సింగ్‌ ప్రావీణ్యానికి తగినట్టుగా తన సరసన ఓ మ్యూజికల్‌ చిత్రంలో అవకాశం కల్పిస్తుంది. ఆ సినిమా పెద్ద హిట్టవుతుంది, వారిద్దరి ప్రేమలాగే! రంగులు, స్కోపులు, సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాను తీయడం ఓ సాహసమనుకుంటే, ఆ సినిమా విజయవంతమవడం ఓ విచిత్రమే. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.