వ్యాసం మారింది సినిమాగా!

ఓ వార పత్రికలో వచ్చిన ఓ వ్యాసం ఆధారంగా కథ అల్లుకుని తీసిన ఓ సినిమా ఏడు ఆస్కార్‌ అవార్డులు సాధించింది. ‘టైమ్‌’ పత్రికలో 1944లో ఓ వ్యాసం ప్రచురితమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంటికి వచ్చిన సీనియర్‌ సైనికాధికారులు, తిరిగి సమాజ జీవనంలో ఒదిగిపోయేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ఆ వ్యాసం. ఇది శామ్యూల్‌ గోల్డ్‌విన్‌ అనే వ్యక్తిని ఆకర్షించింది. ఇందులోని అంశాల ఆధారంగా ఓ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. గతంలో యుద్ధవార్తలు రాసిన ఓ జర్నలిస్ట్‌ను సంప్రదించి కథ రాయించాడు. దాన్ని తనే సినిమాగా తీశాడు. ఆ సినిమానే ‘ద బెస్ట్‌ ఇయర్స్‌ ఆఫ్‌ అవర్‌ లైవ్స్‌’ అనే సినిమా. విలియం వైలర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1946లో విడుదలై 7 ఆస్కార్‌ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకోవడమే కాకుండా, 2 మిలియన్‌ డాలర్ల ఖర్చుకి, 23 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ముగ్గురు సైనికాధికారులు విమానంలో తిరిగి వస్తూ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. వాళ్లు ఇంటికి వచ్చాక తమ కుటుంబాల్లో ఎన్నో మార్పులు జరిగాయని తెలుసుకుంటారు. ఆ మార్పులేంటి, వాటి వల్ల వారికెదురైన అనుభవాలేంటనేదే కథ.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.