చార్లీ చాప్లిన్‌కి ఇష్టమైన సినిమా

ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ అంటే తెలియని వారు ఉండరు. చాప్లిన్‌ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా రూపొందించిన ‘ద గోల్డ్‌ రష్‌’ సినిమా 1925లో ఇదే రోజు విడుదలైంది. అంటే 94 ఏళ్ల నాటి సినిమా అన్నమాట. ఇప్పటికీ ఈ సినిమాను ఓ క్లాసిక్‌గా ప్రపంచవ్యాప్తగా అభిమానించే వాళ్లు ఉన్నారు. చాప్లిన్‌ అనగానే గుర్తొచ్చే వదులు ప్యాంటు, బిగుతు కోటు, పెద్ద బూట్లు, టోపీలతో కూడిన వేషంతో తొలిసారి కనిపించింది ఈ సినిమాతోనే. దీన్ని ‘లిటిల్‌ ట్రాంప్‌’ వేషం అంటారు. ఈ సినిమా ఆలోచన వెనుక ఓ నేపథ్యం ఉంది. అప్పట్లో కెనడాలోని క్లోండైక్‌ అనే ప్రాంతంలో బంగారం గనులున్నాయని కనుగొన్నారు. ఆ వార్త తెలియగానే ఆ బంగారం కోసం దాదాపు లక్ష మంది ఆ ప్రాంతానికి వలసపోవడం మొదలెట్టారు. మంచు పర్వతాల మయమైన ఆ ప్రాంతంలో మంచు తుపానుల్లో చిక్కుకుని తిండిలేక అల్లాడారు. ఆఖరికి తమ బూట్లు తామే తినే స్థితికి వచ్చారు. ‘గోల్డ్‌రష్‌’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వార్తను చదివిన చాప్లిన్‌కి ఈ నేపథ్యంతో సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. విషాదం, హాస్యం పక్కపక్కనే ఉంటాయనే సిద్ధాంతంతో దీన్ని ఓ అద్భుత నిశ్శబ్ద చిత్రంగా మలిచాడు చాప్లిన్‌. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం తను తీసినవాటిలోకెల్లా తనకిష్టమైనదని చాప్లిన్‌ చాలా సార్లు చెప్పాడు. అప్పట్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్‌ డాలర్లు ఆర్జించి అత్యధిక వసూళ్లు సాధించిన నిశ్శబ్ద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి శబ్దాన్ని, సంగీతాన్ని జోడించి చాప్లిన్‌ తిరిగి 1942లో విడుదల చేశారు. ఇందులో చాప్లిన్‌ చేసిన ‘రోల్‌ డ్యాన్స్‌’ను చలన చిత్ర చరిత్రలోనే అపురూపమైనదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.