షర్లాక్‌ హోమ్స్‌ పరిశోధనడి
టెక్టివ్‌ కథలను ఇష్టపడేవారికి షర్లాక్‌ హోమ్స్‌ గురించి వేరే చెప్పక్కర్లేదు. చురుగ్గా, తెలివిగా, అనూహ్యమైన వేగంతో కేసులను పరిశోధించే ఈ డిటెక్టివ్‌ పాత్రను సృష్టించింది సర్‌ ఆర్థర్‌ కోనన్‌ డోయల్‌. ఈ బ్రిటిష్‌ రచయిత స్వతహాగా వైద్యుడు అయినప్పటికీ సాహిత్యం మీద ఆసక్తితో కథలను రాసేవాడు. తొలిసారిగా 1887లో ‘ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్‌’ అనే నవల ద్వారా డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ పాత్రకు ప్రాణం పోశాడు. అది అందరినీ ఆకట్టుకోవడంతో మరో మూడు నవలలు రాశాడు. ఆపై ఈ డిటెక్టివ్‌ పాత్రతోనే దాదాపు 50 కథలు రాశాడు. నేర పరిశోధన సాహిత్యంలో ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవిగా పేరొందాయి. అలాంటి ప్రఖ్యాత డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ ప్రధాన పాత్రగా 1939లో తీసిన సినిమా ‘ద హౌండ్‌ ఆఫ్‌ ద బాస్కర్‌విల్లేస్‌’. ఈ సినిమా విజయవంతమవడంతో షర్లాక్‌ హోమ్స్‌ పాత్రతో హాలీవుడ్‌లో మరో 13 సినిమాలు వచ్చాయి. బాస్కర్‌విల్లేస్‌ అనే పెద్ద ఎస్టేటుకు చెందిన వారసులను ఓ భయంకరమైన నల్ల కుక్క (హౌండ్‌) చంపేస్తూ ఉంటుంది. ఆ వంశస్థులలో చివరివాడైన హెన్రీ బాప్కర్‌విల్లే వస్తున్న సందర్భంగా ఆ సంస్థానం మేనేజర్‌ వారి రక్షణ కోసం డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ను సంప్రదిస్తాడు. ఆ కుక్క కారణంగా చనిపోయిన వారి కేసులలో పరిశోధన మొదలవుతుంది. ప్రతి వారూ భయం వల్ల గుండె ఆగిపోయి చనిపోతారు తప్ప, ఎవరి ఒంటి మీదా ఎలాంటి గాయాలూ ఉండవు. ఈ లోగా హెన్రీ బాస్కర్‌విల్లే వస్తాడు. అతడిని డిటెక్టివ్‌ షర్లాక్‌ హోమ్స్‌ ఎలా కాపాడాడనేదే కథ. ఈ సినిమా ‘వందేళ్లలో వంద థ్రిలింగ్‌ సినిమాలు’ జాబితాలో స్థానం సాధించింది. ‘మేటి పది మిస్టరీ సినిమాలు’లో ఒకటిగా నిలిచింది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.