అలరించే భయంకర సినిమా

- పెట్టుబడి 19 మిలియన్‌ డాలర్లు... వసూళ్లు 272.7 మిలియన్‌ డాలర్లు!
- ఆస్కార్‌ అవార్డుల్లో మొదటి అయిదు విభాగాలనూ గెల్చుకున్న కేవలం మూడు సినిమాల్లో ఒకటి!
- ఆస్కార్‌ సాధించిన మొదటి హారర్‌ చిత్రం!

- అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు!
- ప్రపంచంలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా విమర్శకులు, దర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు!


ఇన్ని ఘనతలు సాధించిన సినిమా ‘ద సైలెన్స్‌ ఆఫ్‌ ద ల్యాంబ్స్‌’ (1991). సైకలాజికల్, హారర్, థ్రిలర్‌. దర్శకుడు జోనాథన్‌ డమ్మీ. గొప్ప నటిగా ఎన్నో అవార్డులు సాధించిన జోడీ ఫాస్టర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఆంథోనీ హాప్కిన్స్, స్కాట్‌ గ్లెన్‌ తదితరులు నటించారు. దీన్ని థామస్‌ హ్యారిస్‌ అనే రచయిత 1988లో రాసిన నవల ఆధారంగా తీశారు.

కథేంటి: ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో ట్రైనీగా చేరిన క్లారిస్‌ అనే అమ్మాయి, ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్న భయంకర ఖైదీని ఇంæరాగేట్‌ చేయాల్సి వస్తుంది. అతడో సీరియల్‌ కిల్లర్‌. వరసగా హత్యలు చేసి వారిని తిన్న నరమాంస భక్షకుడు. ఇంతకీ అతడినెందుకు ఇంæరాగేట్‌ చేయడం? అమెరికాలో బొద్దుగా, అందంగా ఉండే అమ్మాయిలను ఎంచుకుని వాళ్లని జలాశయాల్లో ముంచి హత్యలు చేస్తూ వాళ్ల చర్మాలను ఒలిచేస్తున్న మరో సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకునే వ్యూహంలో భాగంగానే. ఇలాంటి భయంకర హత్యలు చేసే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకోడానికే. కథ ఇలాంటిదైనప్పుడు ఇక ఆ సినిమాలో భయంకరమైన, ఉత్కంఠభరితమైన, ఉన్మాద కరమైన సన్నివేశాలకు కొదవేం ఉంటుంది? అందుకనే ఈ సినిమా ప్రపంచ వ్యాపంగా భయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కాసులు, అవార్డులు కురిపించింది.  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.