అంతర్జాతీయ నవల...హాలీవుడ్‌ సినిమా

ఏమాత్రం పాఠకాదరణ పొందిన నవలైనా దాని ఆధారంగా సినిమా తీసేస్తారు నిర్మాతలు. అలాంటింది అంతర్జాతీయంగా అత్యధిక పుస్తకాలు అమ్ముడుపోయిన నవలను వదుల్తారా? అలాంటి నవలే ‘ద షేక్‌’. బ్రిటిష్‌ రచయిత్రి ఎడిత్‌ మాడే హల్‌ 1921లో రాసిన ఈ నవల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీని ఆధారంగా అదే పేరుతో ఓ మూకీని తెరకెక్కించారు. సైలెంట్‌ చిత్రాల కాలంలో అందాల తారగా పేరొందిన ఆగ్నెస్‌ ఐర్స్, ఇటలీ నటుడు రుడాల్ఫ్‌ వాలెంటినో జంటగా నటించిన ఈ చిత్రానికి జార్జి మెల్‌ఫోర్డ్‌ దర్శకత్వం వహించాడు. ఇది విజయవంతమవడంతో పాటు కాసులు కురిపించడంతో దీనికి సీక్వెల్స్‌గా 1926లో ‘ద సన్‌ ఆఫ్‌ ద షేక్‌’, 1927లో ‘షీ ఈజ్‌ ఎ షేక్‌’ సినిమాలు వచ్చాయి. ఓ అందమైన అమ్మాయిని ఓ అరబ్‌ షేక్‌ ప్రేమించి అపహరించి ఎడారిలో తన కోటకు తీసుకుపోతాడు. అక్కణ్ణుంచి తప్పించుకోడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓసారి అలా తప్పించుకుపోతుంటే ఆమెను బందిపోట్లు బంధించి తీసుకుపోతుంటారు. అప్పుడు షేక్‌ వచ్చి ఆమెను వాళ్ల చెరనుంచి విడిపించి ఆమె ప్రేమను చూరగొంటాడు. సాహసపూరితమైన రొమాంటిక్‌ సినిమాగా ఇది అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.