సినీ చరిత్రలో ఓ అద్భుతం!
ప్రపంచ సినీ చరిత్రలో అద్భుతమైన సినిమాల జాబితా తయారు చేస్తే అందులో ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమా తప్పకుండా ఉంటుంది. బైబిల్‌ కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మక విజయం సాధించింది. ప్రఖ్యాత దర్శకుడు సిసిల్‌ బి.డెమిల్లే రూపొందించిన ఈ దృశ్యకావ్యం పారమౌంట్‌ పిక్చర్స్‌ ద్వారా 1956 అక్టోబర్‌ 5న విడుదలైంది. ఈ సినిమాను కొన్ని నవలలైన ‘ప్రిన్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌’ (డరోతీ క్లార్క్‌ విల్సన్‌), ‘పిల్లర్‌ ఆఫ్‌ ఫైర్‌’ (జెహెచ్‌. ఇన్‌గ్రహామ్‌), ‘ఆన్‌ ఈజిల్స్‌ వింగ్స్‌’ (ఎ.ఇ. సౌతన్‌), ‘ఎక్సోడస్‌’ (మతగ్రంథం)లోని అంశాల ఆధారంగా తెరకెక్కించారు. ఈజిప్ట్‌ యువరాజు మోజెస్‌ కథగా ఇది కనిపిస్తుంది. బానిసలుగా ముద్రపడిన హెబ్రూలను స్వేచ్ఛ బాటలో నడిపించిన మహిమాన్వితుడిగా మోజెస్‌ను చెబుతారు. దేవుడు అతడి ద్వారా మానవాళికి పవిత్రమైన పది ఆదేశాలను (టెన్‌ కమాండ్‌మెంట్స్‌) అందించాడని బైబిల్‌ చెబుతోంది. ఇందులో మోజెస్‌గా చార్ల్‌టన్‌ హెస్టన్, ఈజిప్టు యువరాజు రామెసెస్‌గా యుల్‌ బ్రిన్నర్, ఈజిప్టు రాణి నెఫ్రెటిరిగా అన్నే బాక్స్‌టర్‌ తదితరులు నటించారు. సినీ చరిత్రలోనే అద్భుతమనిపించే భారీ సెట్టింగులను ఈ సినిమాలో వాడారు. ఇది ఏడు ఆస్కార్‌లకు నామినేషన్లు పొంది, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఆస్కార్‌ అందుకుంది. అప్పట్లో భారీ ఖర్చుతో రూపొందిన సినిమాగా పేరు పొందింది. 13 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా తొలి రిలీజ్‌లోనే 122 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది 2011 నాటి ధరవరలతో పోలిస్తేనే 200 కోట్ల డాలర్లకు సమానమని గిన్నిస్‌ రికార్డుల పుస్తకం పేర్కొంది.


ఈ సినిమాలో... మోజెస్‌ కోసం ఎర్రసముద్రం రెండుగా చీలిపోయి దారి ఇవ్వడం, టెన్‌కకమాండ్‌మెంట్స్‌ రాతిపై అక్షరాలుగా మారడం, అగ్నిస్థంభం ఏర్పడడం, మృత్యు మేఘాలు కమ్ముకోవడం లాంటి ఎన్నో దృశ్యాలు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో కనువిందు చేస్తాయి. యూదు ప్రజల్ని బానిసలుగా చేసుకున్న ఈజిప్టు రాజు రామెసెస్‌కు, త్వరలో యూదుల్ని విముక్తి చేసేవాడు పుట్టబోతున్నాడని తెలుస్తుంది. దాంతో కొత్తగా పుట్టబోయే మగపిల్లల్నందరినీ చంపేయాలని ఆదేశిస్తాడు. ఆ పరిస్థితుల్లో మార్తా తనకు పుట్టిన బిడ్డను ఓ తొట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తుంది. ఆ తొట్టెను చూసిన ఫారో చెల్లెలు నినా ఆ బిడ్డను తెచ్చుకుని పెంచుకుంటుంది. ఫారో కుమారుడైన రామెసెస్‌కు పోటీ యువరాజుగా మోజెస్‌ పెరుగుతాడు. ఈజిప్టు పాలకులు బానిసల పట్ల చూపుతున్న క్రూరమైన పద్ధతులను వ్యతిరేకిస్తాడు మోజెస్‌. ఈలోగా మోజెస్‌ ఓ యూదు బిడ్డ అని బయట పడుతుంది. దాంతో అతడిని ఎడారిలోకి తరిమేస్తారు. అక్కడ మోజెస్‌కు దేవుడు ప్రత్యక్షమై బానిసలను విముక్తి చేయమని ఆదేశిస్తాడు. మోజెస్‌ ఈజిప్టు పాలకులను కలిసినా బానిసలకు స్వేచ్ఛనిచ్చేందుకు వాళ్లు అంగీకరించకపోవడంతో మృత్యు మేఘాలు కమ్ముకుని ప్లేగు వ్యాధి ప్రబలుతుంది. ఈజిప్టు ప్రజలు బానిసల్ని పొమ్మంటారు. వాళ్లు వెళ్తుంటే రోమన్‌ సైనికులు వెంట తరుముతారు. మోజెస్‌ ప్రార్థనపై సైనికులను అడ్డుకునేందుకు అగ్ని స్తంభం ఏర్పడడం, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి దారి ఇవ్వడం లాంటి మహిమలు జరుగుతాయి. స్వేచ్ఛ లభించిన యూదులు విశృంఖలత్వానికి ఒడిగడితే మోజెస్‌ ద్వారా దేవుడు ‘పది ఆదేశాలు’ అందిస్తాడు.

ఆసక్తికరమైన విశేషాలు...
* తరుముకొస్తున్న ఈజిప్టు సైనికుల నుంచి హెబ్రూలను రక్షించడం కోసం మోజెస్‌ ప్రార్థనపై ఎర్రసముద్రం నిలువునా చీలిపోయి దారి ఇచ్చే దృశ్యం చిత్రాకరణ దాదాపు ఆరు నెలలు పట్టింది. ఇందు కోసం పేరమౌంట్‌ స్టూడియోలో 3,60,000 గ్యాలన్ల నీటిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో నిలబడేలా చేసి షూటింగ్‌ జరిపారు.

* సినిమా కోసం 14,000 మంది ఎక్స్‌ట్రా నటులను, 15,000 జంతువులను ఉపయోగించారు.

*
ఈ సినిమా తీసే సమయానికి దర్శకుడు సిసిల్‌ బి.డెమిల్లేకి 75 ఏళ్లు. ఈ వయసులో దర్శకత్వం చేసిన వారు అప్పట్లో ఎవరూ లేరు. ఈయనే 1923లో ఇదే పేరుతో ఇదే కథను సినిమాగా మలిచాడు. తిరిగి మారిన సాంకేతికను ఉపయోగిస్తూ రీమేక్‌గా మళ్లీ తీయడం విశేషం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.