మొట్టమొదటి థియేటర్‌!


థి
యేటర్‌కి వెళ్లి సినిమా చూడ్డం ఇప్పటికీ ఓ వినోదాంశమే. మరి తొలి థియేటర్‌ను ఎక్కడ, ఎప్పుడు కట్టారు? సినీ చరిత్రలో ఆ ఘనత లాస్‌ఏంజెలిస్‌లోని ‘టాలీస్‌ ఎలక్టిక్ర్‌ థియేటర్‌’కే దక్కుతుంది. దీన్ని 1902 ఏప్రిల్‌ 2న ప్రారంభించారు. కేవలం సినిమాల ప్రదర్శన కోసమే ఉద్దేశించి ప్రత్యేకమైన తలుపులు, సీట్లు, తెరలతో నిర్మించిన థియేటర్‌ ఇది. థామస్‌ లింకన్‌ టాలీ అనే ఆయన దీన్ని కట్టారు. అంతక్రితం కూడా సినిమాల ప్రదర్శన జరిగింది కానీ, వాటిని డేరాల్లోనో, లేదా ఏదో భవనంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి ప్రేక్షకులకు చూపించేవారు. ఈ థియేటర్‌లో మొదట్లో రాత్రి 7.30కి, రాత్రి 10.30కి మాత్రమే షోలు ఉండేవి. కానీ ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు త్వరలోనే మ్యాటినీ షోలు మొదలుపెట్టారు. అప్పట్లో టికెట్‌ ఖరీదు పది సెంట్లు. టాలీ సినిమా చరిత్రలో పలు పాత్రలు పోషించాడు. జేమ్స్‌ డిక్సన్‌ విలియమ్స్‌తో కలిసి తొలి నేషనల్‌ పిక్చర్స్‌ సంస్థను ప్రారంభించి సినీ నిర్మాణాలు చేపట్టాడు. వార్నర్‌ బ్రదర్స్‌తో కలిసి తొలి రంగుల సినిమాను 1912లో లాస్‌ఏంజెలిస్‌లో ప్రదర్శించాడు. ప్రముఖ నటులు మేరే పిక్‌ఫోర్డ్, చార్లీచాప్లిన్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నది కూడా ఈయనే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.