బొమ్మలకు ప్రాణం వస్తే?!

పిల్లలు ఆడుకునే బొమ్మలకు ప్రాణం వస్తే? అవి మనుషుల్లాగే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే? కొత్త బొమ్మలు పాత బొమ్మల్ని వెటకారం చేస్తే? పాత బొమ్మలు తమను నిరూపించుకోడానికి ప్రయత్నిస్తే? ఆపై ఆ బొమ్మలన్నీ కలిసి సాహసాలు చేస్తే? ఈ ఊహలతో వెండితెరపై రూపుదిద్దుకున్నవే ‘టాయ్‌స్టోరీ’ సినిమాలు. వీటిలో తొలి సినిమా 1995లో వస్తే దానికి కొనగాగింపుగా మరో రెండు సినిమాలు 1999, 2010లో వచ్చాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత విజయవంతమయ్యాయంట, మూడు సినిమాలను రూపొందించడానికి 320 మిలియన్‌ డాలర్లు ఖర్చయితే, అవి మూడూ కలిసి 1.9 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి. మూడు సినిమాలూ వేటికవి రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు నాలుగో సినిమాగా ‘టాయ్‌స్టోరీ4’ ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది. ఈ సినిమాల పరంపరలో వచ్చిన రెండో సినిమా 1999 నవంబర్‌ 13న విడుదలై 90 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 497 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. మొదటి సినిమాలో పాత కౌబోయ్‌ బొమ్మ ‘ఉడీ’కీ, కొత్త బొమ్మ ‘బజ్‌ లైట్‌ఇయర్‌’కి మధ్య పోటాపోటీ, సూటీపోటీ మాటల యుద్ధంగా నడిస్తే, రెండో సినిమాలో ఓ దొంగ ఎత్తుకుపోయిన ‘ఉడీ’ని కాపాడ్డానికి ‘బజ్‌ లైటియర్‌’ బొమ్మ మిగిలిన బొమ్మలతో కలిసి సాహసాలు చేయడం కథ. వాల్ట్‌డిస్నీ, పిక్సార్‌ యానిమేషన్‌ సంస్థల నుంచి వచ్చిన ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.