మారువేషాలు వేసే రోబోల కథ!

ఆకారాలు మార్చుకునే రోబోలు... వాటి మధ్య యుద్ధాలు... ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని కూడా అలరించాయి. ఆ సినిమాలే ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’. వేరే గ్రహాల నుంచి రోబోలు వచ్చి మన భూమి మీద పడడం, వాటికి వేర్వేరు ఆకారాల్లోకి మారే శక్తులు ఉండడం, అవి మన కార్లు, వాహనాల రూపంలోకి మారిపోవడం, అవసరమైనప్పుడు రోబోల్లాగా ఆకారం మార్చుకోవడం... ఇలా చెబితే ఈ సినిమాల కథ ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఈ గ్రహాంతర మరమనుషుల కథతో ఒకటి కాదు, ఏకంగా అయిదు సినిమాలు వచ్చి అలరించాయి. వాటిలో మొదటిదైన ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ 2007లో విడుదలై విజయవంతమైంది. ఆటోబోట్స్, డిసెప్టికన్స్‌ అనే రెండు రకాల రోబోల మధ్య యుద్ధానికి సంబంధించిన కథ ఇది. ఈ సినిమాను 150 డాలర్ల వ్యయంతో తీస్తే, 709.7 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా విజయంతో నాలుగు సీక్వెల్స్, ఒక ప్రీక్వెల్‌ వచ్చాయి. ‘రివెంజ్‌ ఆఫ్‌ ద ఫాలెన్‌’ (2009), ‘డార్క్‌ ఆఫ్‌ ద మూన్‌’ (2011), ‘ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్‌టింక్షన్‌’ (2014), ‘ద లాస్ట్‌ నైట్‌’ (2017), ‘బంబుల్‌బీ’ (2018) పేర్లతో వచ్చిన ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 4.38 బిలియన్‌ డాలర్లు ఆర్జించాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.