యుద్ధనౌకలో..ఉగ్రవాదులతో పోరు

అసలే యుద్ధనౌక. ఆపై దాన్నిండా అణ్వాయుధాలు. ఆ ఓడ త్వరలో తీరం చేరనుంది. అదే ఆఖరు ప్రయాణం. అప్పుడే షిప్‌ కెప్టెన్‌ పుట్టిన రోజు రావడంతో నౌకలోని వారందరూ పార్టీ చేసుకుందామనుకుంటారు. ఈలోగా ఓ హెలికాప్టర్‌ ‘బర్త్‌డే సర్‌ప్రైజ్‌’ పేరిట నౌకమీద దిగుతుంది. అనూహ్యంగా అందులో ఉన్నవారందరూ ఉగ్రవాదులు. వాళ్లు వస్తూనే కెప్టెన్‌ సహా కొందరు అధికారులను చంపేసి, మిగతా సిబ్బందిని బందీలుగా చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆ సిబ్బందిని, అందులో ఉన్న ఆయుధాలను ఉగ్రవాదుల నుంచి కాపాడే ఒకే ఒక వ్యక్తి ఆ నౌకలోనే ఉన్నాడు. అతడే చెఫ్‌గా మరి పార్టీ కోసం వంటలు వండుతున్న ఓ అధికారి. అతడొక్కడే మరో ఇద్దరు ముగ్గురితో కలిసి ఉగ్రవాదులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఆపరేషన్‌ మొదలు పెడతాడు... ఈ కథాంశంతో సినిమా తీస్తే అది అడుగడుగునా ఉత్కంఠభరితంగా, ఊపిరి సైతం పీల్చుకోలేనంత సస్సెన్స్‌తో సాగిపోతుందనడంలో సందేహం ఏముంటుంది? అదే జరిగింది ‘అండర్‌ సీజ్‌’ (1992) సినిమాలో. యాక్షన్, థ్రిల్లర్‌ సినిమాగా రూపొందిన దీనికి దర్శకుడు ఆండ్రూ డేవిస్‌. కథానాయకుడు యాక్షన్‌ హీరోగా పేరొందిన ప్రముఖ నటుడు స్టీవెన్‌ సెగల్‌. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు 35 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కి 156.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఆస్కార్‌ నామినేషన్లు పొందింది. అనేక అవార్డులు అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘అండర్‌ సీజ్‌2: డార్క్‌ టెర్రిటరీ’ అనే మరో సినిమా 1995లో వచ్చింది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.