ఆడవాళ్ల సమస్యలు...అంతర్జాతీయ ప్రశంసలు

మస్య గంభీరం... కానీ దాన్ని తీసిన తీరు మాత్రం హాస్యభరితం... అందుకే ఎక్కడో స్పెయిన్‌లో తీసిన ఓ మామూలు సినిమా, అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకొంది. ఆ సినిమా ‘ఉమెన్‌ ఆన్‌ ద వెర్జ్‌ ఆఫ్‌ ఎ నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌’ (1988). ఈ సినిమాతో దర్శకుడు పెడ్రో ఆల్‌మోడొవర్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీనికి అయిదు స్పెయిన్‌ జాతీయ అవార్డులతో పాటు, ఆస్కార్‌ ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు, మరెన్నో పురస్కారాలు లభించాయి. మగవాళ్ల ఆధిపత్యం, మహిళల నిస్సహాయతలకు సంబంధించిన అంశాలను చాలా సున్నితంగా, వ్యంగ్యంగా, ఆలోచింపజేసేలా తీయడంతో ఇది దేశదేశాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నటించిన మహిళలందరికీ ఓ ఉమ్మడి సమస్య ఉంటుంది. అదేంటంటే, ఏదైనా అనూహ్యమైన వార్త విన్నా, ఇష్టంలేని సంఘటన జరిగినా విపరీత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అప్పుడు వాళ్లెలా ప్రవర్తిస్తారో, ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. తనను అకస్మాత్తుగా వదిలేసిన ప్రేమికుడి ఆచూకీ తెలుసుకోడానికి ఓ అమ్మాయి చేసే ప్రయత్నాలతో కథ మొదలవుతుంది. ఆ అన్వేషణలో అతడికి అప్పటికే పెళ్లయిందని, పిల్లాడు కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఆమెను కలుస్తుంది. ఆ ఇద్దరూ కలిసి మళ్లీ అన్వేషిస్తుంటే అతడితో సంబంధం ఉన్న మరో మహిళ తారసపడుతుంది. అతడి కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారని తెలుస్తుంది. అతడితో స్నేహసంబంధాలు ఉన్న అందరి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని బయటపడుతుంది. అసలే ఈ మహిళలందరికీ నెర్వస్‌ సమస్య ఉంది. పైగా ఇలాంటి అనూహ్యమైన సంగతులు అడుగడుగునా ఎదురవుతుంటే, వాళ్లంతా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు, చివరికి అతడిని కనుక్కున్నారా, అతడి నేరస్థుడనేది నిజమేనా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ప్రపంచ సినీ చరిత్రలోని మేటి 100 సినిమాల జాబితాలో ఇది స్థానం సంపాదించుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.