అమెరికా, రష్యాల యుద్ధాన్ని తప్పించిన జేమ్స్‌బాండ్‌

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించే జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో అయిదవది ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’ (1967). బాండ్‌ పాత్రను సృష్టించిన రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ 1964లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో బాండ్‌గా సీన్‌ కానరీ నటించాడు. అమెరికా, రష్యా వ్యోమగాములు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక అనూహ్యంగా కక్ష్య నుంచి అదృశ్యమైపోతుంది. రెండు దేశాలూ ఒకటినొకటి అనుమానించి ఆరోపణలు మొదలు పెడతాయి. ఇది రాజకీయ ఘర్షణకు దారి తీస్తుండడంతో జేమ్స్‌బాండ్‌ రంగంలోకి దిగుతాడు. రెండు అగ్రరాజ్యాల చిచ్చు పెట్టి తద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలనే ఎత్తుగడతో అంతరిక్ష నౌకను మాయం చేసిన దుండగులను జపాన్‌ ప్రాంతంలోని మారుమూల దీవిలో కనుగొని బాండ్‌ వాళ్ల ఆటనెలా కట్టించాడనేదే సినిమా కథ. ఈ చిత్రాన్ని 10.3 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే, ప్రపంచవ్యాప్తంగా 111 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.


మరిన్ని విశేషాలు...
- ఈ సినిమా కోసం వేసిన అగ్నిపర్వతం సెట్‌ ఖరీదు అంతకు ముందు వచ్చిన ‘డాక్టర్‌ నో’ జేమ్స్‌బాండ్‌ సినిమా బడ్జెట్‌తో సమానం కావడం విశేషం. ఈ సెట్‌ మూడు మైళ్ల దూరం నుంచి కూడా కనిపించేంత పెద్దది. దీని నిర్మాణం కోసం 700 మెట్రిక్‌ టన్నుల స్టీలును, 200 మైళ్ల పొడవుండే స్టీలు గొట్టాలను, 200 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టర్‌ను వాడారు. అప్పట్లోనే ఈ సెట్‌ నిర్మాణానికి మిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చయింది.

- జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో బాండ్‌ కారు నడపని సినిమా ఇదొక్కటే.

- దీనికి రెండు నెలల తర్వాత ‘క్యాసినో రాయల్‌’ విడుదలై ఒకే ఏడాది రెండు బాండ్‌ సినిమాలు వచ్చిన రికార్డును సృష్టించాయి. తిరిగి ఇలా 1983లో కానీ జరగలేదు. ఆ ఏడాది ‘ఆక్టోపస్సీ’, ‘నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌’ సినిమాలు విడుదలయ్యాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.