
‘వినయ విధేయ రామ’ చిత్రంతో సినీ ప్రియుల్ని మెప్పించారు రామ్ చరణ్, కియారా అడ్వాణీల జోడీ. ఇప్పుడీ జంటగా మరో మారు వెండితెరపై సందడి చేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుతో పాటు మరో యువ కథానాయకుడికీ స్థానం ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ పాత్రను మహేష్‌బాబుతో చేయించబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ అవి కార్యరూపంలోకి రాలేదు. పారితోషికం విషయంలో మహేష్‌కు ఎక్కువ చెల్లించాల్సి రావడమే దీనికి కారణమని గుసగుసలు వినిపించాయి. దీంతో ఇప్పుడీ పాత్రను రామ్‌చరణే చెయ్యాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడీ పాత్రకు జోడీగానే కియారాను సంప్రదిస్తోందట చిత్ర బృందం. నిజానికి ఇందులో కియారా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాకు కీలకంగా నిలవనుందట. అందుకే కియారాతో తనకున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని చెర్రీనే ఈ పాత్ర విషయమై ఆమెతో స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఇది అతిథి పాత్రైనా చిరు చిత్రం కావడంతో సంతోషంగా ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది వాస్తవమా? కాదా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.