ఒక్క షోతో తీసేసే చిత్రానికి థియేటర్లు కావాలా?

కొత్త దర్శకులు, నటీనటులలోని ప్రతిభను ప్రేక్షకులకు రుచి చూపించే చిత్రాలు ఏటా కనీసం పది వరకైనా బాక్సాఫీస్‌ ముందుకొస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి బెస్ట్‌ అనిపించుకున్న చిన్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవల్సింది ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ గురించే. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. హీరో కొత్తవాడు. చేతిలో ఉన్న బడ్జెట్‌ అంతంత మాత్రం. పైగా ఎంచుకున్న స్క్రిప్ట్‌ ఓ ఏజెంట్‌ స్టోరీ. ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా. కానీ, ఈ కథతోనే ఉన్న కొద్ది బడ్జెట్‌లోనే చక్కటి చిత్రాన్ని చూపించి తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఆత్రేయ చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై మూడు వారాలు గడుస్తున్నా మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌లో నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యే ముందురోజు వరకు ఎగ్జిబిటర్ల వల్ల ఎంతో ఒత్తిడిని అనుభవించినట్లు చెప్పారు. ‘‘ఈ రోజుల్లో సినిమాలు తీయడం కన్నా.. రిలీజ్‌ చేసుకోవడం కష్టమవుతోంది. మా చిత్రానికి థియేటర్లు కావాలని అడిగితే.. మొదటి షోకే తీసేసే సినిమాకు థియేటర్లు ఎందుకయ్యా అని ప్రశ్నించిన వాళ్లున్నారు. కానీ, ఇప్పుడీ చిన్న చిత్రం మూడో వారం కూడా విజయవంతంగా ఆడుతోంది’’ అని భావోద్వేగంతో చెప్పారు రాహుల్‌. ఇకపై నుంచి ఈ సిరీస్‌లో వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.