బన్నీ - సుక్కు.. పట్టాలెక్కలేదు ఎందుకు??

అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలిసి ‘ఏఏ 19’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం చేస్తూనే సుకుమార్‌ దర్శకత్వంలో ‘ఏఏ 20’ని కూడా పట్టాలెక్కించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు బన్నీ. వాస్తవానికి ఈ చిత్రం మే 11న లాంఛనంగా మొదలుకాబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, నిన్న అలాంటిదేమీ జరుగలేదు. ఈ నేపథ్యంలో సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణాలేంటి? అని ఫిలిం నగర్‌లో చర్చలు మొదలైపోయాయి. అయితే దీనికి సరైన కారణాలు దొరకనప్పటికీ సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని మే 15 తర్వాత చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీస్‌ నుంచి చిత్ర బృందానికి ఆదేశాలు జారీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల బ్యాక్‌డ్రాప్‌తో ఓ సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట సుకుమార్‌. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.