యాస మీద ఫుల్‌ ఫోకస్‌!


అగ్ర దర్శకుడు సుకుమార్‌ సినిమాల్లో హీరోలు పాత్రల్లో వంద శాతం ఒదిగిపోయి కనిపిస్తుంటారు. వాళ్లని తన కథలతోనూ, పాత్రలతోనూ అంతగా ప్రభావితం చేస్తుంటారాయన. ప్రస్తుతం ‘పుష్ప’ విషయంలోనూ అదే జరుగుతోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం బన్నీ కసరత్తులు జోరుగా కొనసాగుతున్నాయి. రోజూ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ విస్తృతంగా చర్చించుకుంటూ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. మొన్నటిదాకా సినిమాలో తాను పలికే సంభాషణలపైనే దృష్టి పెట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా పూర్తి స్థాయిలో యాస సొగసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అది తన పాత్రకి మరింత మేలు చేస్తుందనేది అల్లు అర్జున్‌ ఆలోచన అని ఆయన సన్నిహితులు చెప్పారు.




అదే గెటప్పులో...

‘పుష్ప’లో అల్లు అర్జున్‌ గుబురు గడ్డంతో కనిపించబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆ గెటప్పుతో కూడిన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. గతంలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం కావడంతో, అల్లు అర్జున్‌ పూర్తిగా ఈ సినిమా లుక్‌లోకి మారిపోయారు. అంతలోనే లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయినా అల్లు అర్జున్‌ ఆ గెటప్పుని అలాగే కొనసాగిస్తున్నారు. చిత్రీకరణకి ఎప్పుడు అనుమతులు లభించినా, వెంటనే రంగంలోకి దిగాలనేది చిత్రబృందం ఆలోచన. అందుకే బన్నీ తన గెటప్‌ని మార్చలేదు. ఈ సినిమా ఆరంభంలో వచ్చే యాక్షన్‌ ఘట్టాల కోసం ప్రత్యేకమైన కసరత్తులు జరుగుతున్నాయి. రూ.6 కోట్ల వ్యయంతో వాటిని తెరకెక్కించనున్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.