వంద కోట్లు కొల్లగొట్టి.. పది కోట్లు చేతబట్టి!!
ఎంతటి ప్రతిభ ఉన్నా చిత్రసీమలో అవకాశాలను నిర్దేశించేవి జయాపజయాలే. దర్శకుడు, హీరో, కథానాయిక.. ఏ ఒక్కరూ ఈ సూత్రానికి అతీతులు కారు. ఒక్క హిట్‌ పడితే చాలు రాత్రికి రాత్రే స్టార్‌ స్టేటస్‌ను చేరేసుకోవచ్చు. కళ్లు చెదిరే రీతిలో పారితోషికాలు జేబులో వేసేసుకోవచ్చు. ఇక వరుస అవకాశాల సంగతి సరేసరి. మరిలాంటిది.. ఓ దర్శకుడు వస్తూ వస్తూనే వరుస హిట్లు అందుకుంటే. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ.. వంద కోట్ల వసూళ్లను అవలీలగా కొట్టిపారేస్తే. అలాంటి దర్శకుడి వెంట నిర్మాతలు క్యూ కట్టకుండా ఉంటారా. అతనిపై కోట్ల పారితోషికాలు కురిపించకుండా ఉంటారా. ఇప్పుడిలాంటి దశలోనే ఉన్నాడు యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను ఖాతాలో వేసుకున్న అనిల్‌.. ఇటీవలే ‘ఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌తో రూ.100 కోట్ల దర్శకుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రేంజు, డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యువ డైరెక్టర్‌ ‘మహేష్‌ 26’ను తెరకెక్కించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు. ఇప్పుడీ చిత్రం కోసం ఆయన అందుకోబోతున్న పారితోషికమెంతో తెలుసా. అక్షరాలా రూ.10 కోట్లట. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అనిల్‌.. దిల్‌రాజు నిర్మాణంలోనే మూడు సినిమాలు చేశాడు. కానీ, ఆ మూడు ప్రాజెక్టులు కలిపినా అందుకోనంత మొత్తాన్ని ఇప్పుడీ ఒక్క చిత్రంతోనే అందుకోబోతున్నాడట అనిల్‌. ఇక ఈ మూవీ కోసం హక్కులు, పారితోషికాల రూపంలో మహేష్‌ రూ.50 కోట్ల వరకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ప్రాజెక్టులో దాదాపు 80శాతం వాటా కేవలం దర్శకుడు, హీరోనే పట్టుకెళిపోబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం అనుకున్న మొత్తం మాత్రం రూ.80 కోట్లట. అంటే ఇప్పుడు మిగిలిన రూ.20 కోట్లతోనే అనిల్‌.. ‘మహేష్‌ 26’ను పూర్తి చేయాల్సి ఉంటుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.