ఒక పట్టాన సంతృప్తి చెందని రకం నేను

‘‘నా వయసుకి తగ్గ పాత్రలు పోషించానేమో కానీ.. అచ్చంగా నా వ్యక్తిత్వాన్ని పోలిన పాత్రలు మాత్రం ఇప్పటిదాకా రాలేద’’ని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్‌. చేసింది తక్కువ సినిమాలే అయినా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో అవకాశాలు అందుకున్న ఘనత అనుపమ సొంతం. తొలి అడుగుల్లోనే తెలుగు నేర్చుకొన్న ఈమె ప్రస్తుతం ‘రాక్షసుడు’ చిత్రం చేస్తోంది. తెరపై మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయని అడిగితే... ‘‘నా సినిమాల్ని నేను ఆస్వాదించడం కంటే, నా నటనలో తప్పుల్ని వెతకడంపై దృష్టి మళ్లుతుంది. నటన విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందని రకం నేను. చాలా బాగా చేశాననిపించినా ఆ సంతృప్తి ఒకట్రెండు రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. నటులకి అలా అనిపించడం మంచిదే అని విన్నా’’ అంటోంది అనుపమ. మిమ్మల్ని పోలిన పాత్ర వస్తే ఆనందమా లేక కొత్త పాత్రలు చేయడాన్ని ఆస్వాదిస్తారా అని అడిగితే... ‘‘ఆ రెండు రకాల పాత్రల్లోనూ సవాళ్లుంటాయి. కానీ భిన్నమైన వ్యక్తిత్వాల గురించి తెలుసుకుంటూ, ఆ పాత్రల్లో ఒదిగిపోవడమే ఎక్కువ ఇష్టం’’ అని చెప్పింది అనుపమ.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.