‘అర్జున్‌రెడ్డి’ సీక్వెల్‌ ఉంది.. తెరపైకి వచ్చేది అప్పుడే!!

‘శివ’ తర్వాత ఆ స్థాయిలో తెలుగు చిత్రసీమలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాగా నిలిచిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. యువ దర్శకుడు సందీప్‌ వంగా తెరకెక్కించిన ఈ చిత్రంతో.. విజయ్‌ దేవరకొండ తెలుగు నాట ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్‌ గోల్డెన్‌ ఛాన్స్‌నూ కొట్టేశాడు సందీప్‌. తన తొలి చిత్రాన్నే హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో రూ.300 కోట్ల క్లబ్‌ను చేరుకున్న దక్షిణాది దర్శకుడిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సందీప్‌కు ఇంతటి మంచి గుర్తింపును తీసుకొచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికి సీక్వెల్‌ తీసుకొస్తాడా? అసలు సందీప్‌కు ఆ ఆలోచన ఉందా? అంటే అవుననే సమాధానమిచ్చారు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘అర్జున్‌రెడ్డి’ చిత్రీకరణ జరుగుతున్న రోజుల్లోనే విజయ్‌కు సరదాగా సీక్వెల్‌ చేద్దామా అని అడిగా. ఓ లైన్‌ కూడా తనకు చెప్పా. అది దేవరకొండకు కూడా చాలా నచ్చింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయడం కష్టం. ఆ పాయింట్‌తో సినిమా చేయాలంటే పదిహేనేళ్ల తర్వాతే సాధ్యమవుతుంది. అందులో విజయ్‌ పాత్ర కూడా ‘అర్జున్‌రెడ్డి’లోని పాత్రకు చాలా భిన్నంగా ఉంటుంది’’ అని చెప్పొకొచ్చారు. అయితే సందీప్‌ సీక్వెల్‌ గురించి సరదాగే అన్నట్లు చెప్పినా.. ఆ పాయింట్‌తో 15ఏళ్ల తర్వాత సాధ్యమవుతుంది అని చెప్పడం, విజయ్‌ పాత్ర గురించి వివరణ ఇవ్వడం చూస్తుంటే ఈ స్ర్కిప్ట్‌పై సందీప్‌ కాస్త సీరియస్‌గానే ఆలోచించినట్లు తెలుస్తోంది. ఎలాగూ తను కూడా సీక్వెల్‌ లేదు అనకుండా.. 15 ఏళ్ల తర్వాత అని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి మరో దశాబ్దంన్నర తర్వాత ఓ నయా ‘అర్జున్‌రెడ్డి’ని చూడొచ్చన్నమాట.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.