త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించి అదిరిపోయే మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ కలయికలో సినిమా వస్తుందనగానే సినీ ప్రియుల్లో అంచనాలు పెరిగిపోయాయి. టైటిల్ ఏంటి? నాయిక ఎవరు? అంటూ శోధించారు. ఈ క్రమంలో పలువురి భామల పేర్లు వినిపించినా చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా పేరు విభిన్నంగా ఉంటుందనే విషయం తెలిసిందే. సినిమా వెల్లడించిన తొలినాళ్లలో ‘అయినను పోయి రావలే హస్తినకు’ పేరు వార్తల్లో నిలిచింది. ‘ఎన్టీఆర్ 30’ టైటిల్ ఇదే అంటూ ప్రచారం జోరుగా సాగింది. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో తాజాగా ఆసక్తికర పేరు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదే ‘చౌడప్పనాయుడు’. కథానాయకుడి పాత్రని బట్టి ఈ టైటిల్‌ని అనుకుంటుందట చిత్రబృందం. మరి ఇది ఏమాత్రం నిజమో తెలియాలంటే దర్శకనిర్మాతలు స్పందించాల్సిందే. హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద’ని ఇటీవలే తెలిపారు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ.