బాలు గురించి దివంగత సినీ దిగ్గజాలు చెప్పిన మాటలు
బాలు పాడ‌ని రాగం లేదోమో!
బాలు పాట విన‌ని వారుండ‌రేమో!!

అంత‌గా త‌న గాన ప్ర‌తిభ‌ను చూపారాయన‌. సంగీతానికి భాష లేదంటూ నిరూపించారు. 40 వేల‌కు పైగా పాట‌లు ఆల‌పించి జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. చిన్న పిల్ల‌ల నుంచి వృద్దుల వ‌ర‌కు అంద‌రూ ఆయ‌న గానామృతానికి ముగ్దులు కావాల్సిందే. ఇంకా ఎన్నో పాట‌లు పాడాల్సిన ఆ గ‌ళం మూగబోయిందంటే అభిమాన హృద‌యాలు బరువెక్కాయి. ఆ మ‌హానుభావుడ్ని త‌ల‌చుకుంటూ సామాజిక మాధ్య‌మాల్లో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. సంగీత అభిమానులు, సినీ ప్ర‌ముఖులు బాలు జీవిత విశేషాలు, సాధించిన విజ‌యాలు, ఎదుర్కొన్న స‌వాళ్లు.. తెలుసుకుంటూ, తెలియ‌జెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. ఓ సంద‌ర్భంలో ఈ గాన‌గంధ‌ర్వుడి గురించి దివంగ‌త సినీ దిగ్గ‌జాలు త‌మ అభిప్రాయం పంచుకున్నారు. అల‌నాటి అగ్ర క‌థానాయ‌కులు, గేయ ర‌చ‌యితలు, దర్శ‌క‌,నిర్మాత‌లు బాలుని ఏమ‌న్నారంటే...

‘‘దేశమంతా గర్వించే బాలూ లాంటి గాయకుడ్ని ఒకప్పుడు నేను వద్దని చెప్పినందుకు నేనేమీ బాధపడలేదు. తర్వాత ఆ గాయకుడినే నా సినిమాలకు కావాలని ఏరికోరి పాడించుకున్నానని చాలా గర్వపడుతుంటా’’.

- అందాల కథానాయకుడు, శోభన్‌బాబు

 ‘‘పాటలు అందరూ పాడతారయ్యా. కానీ, పాటలోని భావోద్వేగాల్ని తనకు తానుగా ‘ఫీల్‌’ అయి పాడేవాడు బాలు మాత్రమే’’

- మనసు కవి, ఆత్రేయ

 ‘‘నేను ‘శంకరాభరణం’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోవడానికి మూల కారకుడు బాలసుబ్రహ్మణ్యం. తనదైన ప్రత్యేక శైలిలో శాస్త్రీయ సంగీతంలో పట్టుగల విద్వాంసుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో పాటలు పాడి సంగీతాభిమానులను మెప్పించాడు. అద్భుతమైన స్వరంతో, అపురూపమైన వ్యక్తిత్వంతో అనుక్షణం సంగీతాన్ని ప్రేమిస్తూ, అహంభావాలకేమాత్రం తావీయని బాలూలాంటి వ్యక్తితో సరితూగగల వ్యక్తి ప్రస్తుత పరిశ్రమలో ఎవరూ లేరు’’.

- ప్రముఖ సంగీత దర్శకుడు, కె.వి మహదేవన్‌

 ‘‘సినీ సంగీతానికి కొత్త ఒరవడిని సృష్టించి దానికి సొగసు నిండుదనాన్ని ఇచ్చిన బాలు అభినందనీయుడు’’

- ప్రముఖ దర్శకుడు, జంధ్యాల

 ‘‘పాటలకే ఆటలు నేర్పి స్వరాలతో సరసాలాడుకునే బాలు ఓ సంగీత సాగరం’’.

ప్రముఖ గీత రచయిత, వేటూరి సుందర రామమూర్తి   

‘‘ఘంటసాల లేని లోటును తీర్చడానికి తెలుగు కళామ్మతల్లికి భగవంతుడు అందించిన వరం.. ఎప్పీ బాల సుబ్రహ్మణ్యం. అతనొక అద్భుత నట గాయకుడు. తన గళంతో శాస్త్రీయ సంగీత మధురిమల్ని.. తెలుగు భాష గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలకూ పరిచయం చేసిన అపురూప గాయకుడు బాలు’’.
- ప్రముఖ దర్శకుడు, దాసరి నారాయణరావు           

 ‘‘నేను నిర్మించే చిత్రాల్లో ఏదోక శాఖలో ఏదో విధంగా ఎప్పీబీ చేయి పడకపోతే నాకు వెలితిగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య గల అనుబంధం ఏమిటో మాటల్లో చెప్పలేను. కానీ అసంఖ్యాకమైన బాలూ అభిమానుల్లో ఒకడినని గర్వంగా చెప్పుకుంటాను’’.

- ప్రముఖ నిర్మాత, డి.రామానాయుడు

 ‘‘బాలూ లాంటి గొప్ప గాయకుడికి అభిమానిగా చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడతాను. అపురూప ప్రతిభాపాటవాలతో నిండిన అతడు అత్యుత్తమ అవార్డులకు అన్ని విధాలా అర్హుడు. నేనెప్పుడూ అతనితో పాడించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను’’.

- ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నౌషద్‌ అలీ

 ‘‘గట్టిగా ప్రయత్నిస్తే బాలూ నాలాగా పాడేయగలడు. కానీ, నేను బాలూలా ఎప్పటికీ పాడలేను. ఆ వైవిధ్యత ఆయన గళానికి మాత్రమే సొంతం’’.

- ప్రముఖ గాయకుడు, మంగళంపల్లి బాలమురళి కృష్ణCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.