పూరి కన్నా స్పీడుగా.. సర్‌ప్రైజ్‌కు రెడీ అవండి

వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుల జాబితాను తిరగేస్తే తెలుగులో తొలుత అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్‌దే. ఎంత పెద్ద స్టార్‌ హీరోతో చేసినా సరే రెండు మూడు నెలల్లో చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేయగలరు ఆయన. ఇప్పుడిదే బాటలో నడుస్తున్నాడు ఓ యువ దర్శకుడు. ‘అందాల రాక్షసి’తో నటుడిగా వెండితెరపై మెరిసి.. ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ఇప్పుడీయన నాగార్జున కథానాయకుడిగా ‘మన్మథుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నెలన్నర క్రితమే పోర్చుగల్‌లో చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోని హైదరాబాద్‌కు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ ప్రాజెక్టు ఇటీవలే పట్టాలెక్కడంతో చిత్రీకరణ పూర్తయి తెరపైకి రావడానికి కనీసం ఓ ఐదు నెలలో సమయమైనా అవసరమవుతుందని అంతా భావించారు. ఇక సరైన తేదీలు దొరికితే ఏ దసరాకో, క్రిస్మస్‌కో ఈ కొత్త బొమ్మ తెరపై చూడొచ్చనుకున్నారు. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇంతకన్నా ముందుగానే ‘మన్మథుడు 2’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నాడట. ఎలాగూ ఆగస్టులో ‘సైరా నరసింహారెడ్డి’, నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’, బన్నీ - త్రివిక్రమ్‌ల సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులైలో పెద్దగా పోటీ వాతావారణం ఉండదు. కాబట్టి ఈనెలలోనే ‘మన్మథుడు 2’ను థియేటర్లలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నాడట రాహుల్‌. నాగ్‌ ఆలోచన కూడా ఇదేనట. దీనికి తగ్గట్లుగానే చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు రాహుల్‌. ఇది పెద్ద కాస్టింగ్, చాలా లొకేషన్లతో ముడిపడి ఉన్న సినిమా అయినప్పటికీ.. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగడం వల్ల అనుకున్న దానికన్నా ముందే చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేయనున్నాడట. అందుకే కాన్ఫిడెంట్‌గా జులై నెలను లక్ష్యంగా పెట్టుకున్నాడట రాహుల్‌ రవీంద్రన్‌. ఒకవేళ ఇదే నిజమైతే.. నాగ్‌ అభిమానులకు ఇదొక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అని చెప్పుకోవచ్చు. అన్నట్లు ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాహుల్‌ తన తొలి సినిమా ‘చిలసౌ’ను కేవలం నెల రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.