ఆ క్రేజీ ‘బాయ్స్‌’ మళ్లీ వస్తున్నారు..

ప్రస్తుతం చిత్రసీమలో బయోపిక్‌ల నామ జపం కొంత నెమ్మదించింది. ఇప్పుడంతా సీక్వెల్స్‌ చిత్రాల జోరే కనిపిస్తోంది. ‘భారతీయుడు2’, ‘మన్మథుడు2’, ‘బంగార్రాజు’, ‘గూఢచారి2’ వంటి క్రేజీ ప్రాజెక్టులు సినీ ప్రియులను అలరించేందుకు ముస్తాబవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో సీక్వెల్‌ కూడా వచ్చి చేరబోతున్నట్లు సమాచారం అందుతోంది. అది కూడా భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌కు సంబంధించిన చిత్ర సీక్వెల్‌ కావడం మరో విశేషం. ఇంతకీ ఆ క్రేజీ చిత్రం మరేదో కాదు. 16 ఏళ్ల క్రితం వచ్చి యువతరాన్ని ఉర్రూతలూగించిన ‘బాయ్స్‌’. ఆ రోజుల్లో కుర్రకారు దృష్టిని విశేషంగా అలరించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఓ కుర్ర గ్యాంగ్, వారి అల్లర్లు, చిలిపి సరదాలు, ప్రేమ కబుర్లు ‘బాయ్స్‌’లో కనిపించగా.. త్వరలో రాబోతున్న కొనసాగింపు చిత్రంలో ఆ బాయ్స్‌కు పెళ్లయితే వారి జీవితాలు ఎలా ఉంటాయన్నది చూపించబోతున్నారట. అయితే ఈ కథను బట్టీ సీక్వెల్‌కు ‘బాయ్స్‌ 2’ అనే పేరు కన్నా మరేదైనా టైటిల్‌ ఖాయం చేస్తే బాగుంటుందన్న చర్చలు వినిపిస్తున్నాయట. దీని కోసం మరోసారి సిద్దార్థ, తమన్, భరత్‌ల బ్యాచ్‌నే మళ్లీ రిపీట్‌ చేయబోతున్నారట. అయితే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను శంకరే తీసుకుంటాడా.. లేక తన శిష్యుల్లో మరెవరికైనా అప్పగిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడీ క్రేజీ సీక్వెల్‌ ముచ్చట అటు కోలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.