పని వారాలు నిండుగా.. సినీ వారం ఖాళీగా!!

చిత్రసీమకు సినీవారమంటే శుక్రవారమే. ఆరోజు వస్తుందంటే చాలు థియేటర్లు కొత్త కళను సంతరించుకుంటాయి. వెండితెరపై కొత్త బొమ్మ హొయలు పోతూ సందడి చేసేది ఆరోజే. సినీప్రియులకు నయా వినోదాల విందు దొరికేది ఆ పూటే. అందుకే శుక్రవారం వస్తుందంటే చాలు థియేటర్లలో కనిపించే కొత్త చిత్రాల కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ, తొలిసారి తెలుగు తెరపై ఈ సినీవారం ఖాళీగా మిగిలిపోయింది. వసూళ్లు వర్షం పలుచగా కనిపిస్తుందని భావించే పని వారాలైన (వర్కింగ్‌ డేస్‌) బుధ, శనివారాలు కొత్త బొమ్మలతో సందడి చేశాయి. దసరా సెలవుల నేపథ్యంలో బాక్సాఫీస్‌ ముందు ఈ విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా’.. బుధవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు శనివారం గోపీచంద్‌ ‘చాణక్య’, నవీన్‌ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్‌ల ‘ఊరంతా అనుకుంటున్నారు’ థియేటర్లలో సందడి చేశాయి. వాస్తవానికైతే ఏ కొత్త సినిమానైనా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఎందుకంటే ఆరోజు థియేటర్లలోకి తీసుకొస్తే ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాల సెలవుల్ని క్యాష్‌ చేసుకునే వీలుంటుంది కాబట్టి.. అందరూ శుక్రవారాన్నే టార్గెట్‌గా పెట్టుకుంటుంటారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు గురువారాన్ని కూడా టార్గెట్‌ చేసుకుంటూ విడుదలవుతున్నాయి. ఇక చిత్రసీమకు సోమ, మంగళ, బుధ వారాలన్నవి పని దినాలు. ఆరోజుల్లో కొత్త చిత్రాల్ని విడుదల చేయడానికి ఏ నిర్మాతా సాహసం చేయడు. అయితే దసరా సెలవుల నేపథ్యంలో ‘సైరా’ను బుధవారం విడుదల చేయగా.. ‘చాణక్య’, ‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రాలు శనివారం రిలీజ్‌ చేశారు. తొలిసారిగా శుక్రవారాన్ని ఖాళీగా వదిలేశారు. ఎలాగూ ప్రస్తుతం సెలవుల సీజన్‌ నడుస్తోంది కాబట్టి చిత్ర వర్గాలకు ప్రతిరోజూ పండగ రోజే అయిందన్న మాట. ఏదేమైనా ఇలాంటి చిత్రమైన రోజును మళ్లీ ఓసారి చూడాలంటే వచ్చే సంక్రాంతి సీజన్‌ వరకు వేచి చూడక తప్పదు. అప్పుడు కూడా సెలవుల సీజనే నడుస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రతివారం శుక్రవారం కిందే లెక్కన్నమాట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.