‘ఫైటర్‌’ కోసం అదిరిపోయే టైటిల్‌

‘‘ఫైటర్‌’ కోసం అదిరిపోయే టైటిల్‌ను రెడీ చేశాం’’ అంటోంది నటి, నిర్మాత ఛార్మి. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్ర నిర్మాణ బాధ్యతల్లో ఛార్మి కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ చిత్ర విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘పూరి జగన్నాథ్‌ ఈ కథను విజయ్‌ దేవరకొండను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారు. ఇది మరెవరికో చెప్పాల్సి కథ అసలు కాదు. తొలిసారి కథ విన్నప్పుడే విజయ్‌ కూడా ఫిదా అయిపోయాడు. కథ రిత్యానే ముంబయిలో షూట్‌ చేస్తున్నాం తప్ప.. మరేదో ఉద్దేశంతో కాదు. కాకపోతే ఇప్పుడు కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా చిత్రీకరణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తాం. ఎందుకంటే ముంబయిలో పూర్తి చెయ్యాల్సిన కంటిన్యుటీ సీన్లు చాలానే ఉన్నాయి. కాకపోతే అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే అక్కడి షూట్‌పై ముందుకెళ్తాం. ఈ చిత్రం కోసం చాలా మంది అంతర్జాతీయ ఫైటర్లు పనిచేస్తున్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై నిషేధం ఉన్నందున వాళ్లిక్కడికి రాలేరు. కాబట్టి వారికి సంబంధించిన పనులు మినహా మిగతా వాటిపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాం. ఈ సినిమాతో కచ్చితంగా ఓ కొత్త విజయ్‌ దేవరకొండను చూస్తారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. సినిమాకు ‘ఫైటర్‌’ అన్నది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. కథకు తగ్గట్లుగా అన్ని భాషలకు సరిపోయేలా ఓ అదిరిపోయే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశాం. మంచి ముహూర్తం చూసి దాన్ని విడుదల చెయ్యాలని ప్రణాళిక రచిస్తున్నాం’’ అంది ఛార్మి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.